జిద్దుతో ఎగరేయాలి మన భాష జెండా

ఇయ్యాల కాళోజీ నారాయణరావు జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం. తెలంగాణ రచయితల వేదిక మొదటి మహాసభల్లో  తెలంగాణ బతుకు వేరు, భాష వేరని గర్జిస్తూ ప్రజాకవి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవి

1932లో రాఘవాచార్యులు అనే కోస్తా ప్రాంతీయుడు “తెలంగాణాలో ఆంధ్ర కవులు పూజ్యము” అని గోలకొండ పత్రికకు ఒక ఉత్తరం రాసిండు.. దానిమీద సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణా కవుల కవిత్వాన్ని వాండ్ల వాండ్ల వివరాల తోటి ప్రయాసపడి సేకరించి గోలకొండ కవుల సంచిక ప్రకటించిండు. ఆయన ఇట్లన్నడు “నివురు గప్పిన నిప్పువలె నున్న ఇచ్చటి ఆంధ్రకవుల ప్రజ్ఞాపాండితీ విభవములను ప్రచారము చేయుటకు బయట వారికీ విషయమున గల భ్రమ నివారించుటయు పరమ కర్తవ్యముగా భావించి గోలకొండ కవుల సంచిక వెలువరించుటకు నిశ్చయించు కొన్నారము”.

1940ల నేను బెజవాడకు పోయిన. ఒక హోటల్ల నా ఠికాన. నేను కిందికి వచ్చి అక్కడున్న పుస్తకాల దుకాండ్ల పుస్తకాలు చూస్తున్న. అక్కడ అప్పటికే ఓ పెద్ద మనిషి సూటు బూటు వేసుకొని నిలబడి ఉన్నడు. కొంచెం సేపు నిలబడ్డాంక ఆయన నన్నేదో అడిగిండు ఇంగ్లీషుల. నేను జవాబు చెప్పిన తెలుగుల. ఇంకా ఇట్లనే రెండు మూడు ప్రశ్నలు వేస్తే వాటికి కూడా ‘జవాబులు తెలుగల్నే చెప్పిన. అపుడు ఆయన ఓ ప్రశ్నవేసిండు “టు విచ్ ప్లేస్ యు బిలాంగ్” అని. మాది వరంగల్లన్న, ఆయన వెంటనే “యుసే యు బిలాంగ్ టు వరంగల్, బట్ యువర్ తెల్గు ఈజ్ నాట్ సో బ్యాడ్” అన్నడు. నాకు చర్రీమన్నది. ఏమో కూస్తివి? అన్న. ఆ పెద్ద మనిషికి ఎక్కడ తాకాలో అక్కడ తాకినట్లున్నది. “అదేవిటి? కూస్తివి అంటారేంటి” అన్నడు తెలుగుల. అవును దీన్ని మా దిక్కు‘కూతే’ అంటరు అని మీదే ఊరు అన్న, అంటే బంద రన్నడు. మరి నువ్వు వరంగల్ ఎప్పుడున్న వచ్చినవా? – లేదు – బందర్లో వరంగల్ నుంచి వచ్చినోని తోటి ఎవనితోటైనా మాట్లాడినవా? లేదు. నువ్వు వరంగల్ రాలే. నీ ఊళ్ళ వరంగల్ వానితోటి ఎవనితోటి మాట్లాడలేదు. నీకు వరంగల్ గురించి వరంగల్ తెలుగు గురించి ఏం తెలుసునని “యువర్ తెల్గు ఈజ్ నాట్ సో బ్యాడ్” అన్నవు అని దులిపి పారేసిన.

1952ల కృష్ణదేవరాయ భాషానిలయం స్వర్ణోత్సవాలు జరిగినపుడు ఫరీద్ అనే ఒక కవి ఒక పుస్తకం “కన్నీటి కబురు” అని రాసి శ్రీపాద కృష్ణమూర్తికి ఇచ్చిండు. స్వర్ణోత్సవాల సభల మాట్లాడటానికి వచ్చిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు ఆ పుస్తకం పేరును, అది రాసిన ఆయన్ని, అందులో కవిత్వాన్ని, ఆ వ్యవహారిక భాషను ఎద్దేవ చేసుకుంట మాట్లాడిండు. తెల్లారి కవి సమ్మేళనంల ఆయన విమర్శకు జవాబుగా నేను “సరస్వతీ భక్తుల్లారా” అన్న గేయం రాసి చదివిన. నా గొడవల అచ్చయింది.

శేషాద్రి రమణ కవుల్లో ఒకడైన రమణాచార్యులు బతుకుతెరువు కోసం వరంగల్ వచ్చి ఇక్కడ పంతులుగ నౌకరీ చేసిండు. ఆయన ఇక్కడ శాసనాల పరిశోధన ఇంక ఏదేదో చేసిండు కూడ. ఆయన ఇక్కడ ఇల్లు అదీ ఏర్పాటు చేసికొని సెటిలై ఇక్కడే చచ్చిపోయిండు. ఆయన చచ్చినాంక, ఆయన డైరీ అని సుప్రసన్నో ఎవరో సంపాదకత్వంలో అచ్చు వేసిండ్రు. దాంట్ల ఆయన తన దోస్తుకు ఒగణికి రాసిన ఉత్తరం ఉన్నది. ఏమన్నడెరి కేనా? ఆయన వరంగల్ వచ్చినాంక రెండు పూటలా భోజనానికైతే కరువు లేకుండా వెళ్ళుతున్నది కాని, సాహిత్యకారుల సావాసం లేకుండ చచ్చిపోతున్న అని. ఆయన పక్కింట్లనే గార్లపాటి రాఘవరెడ్డి, పదిండ్లవతల గొట్టుముక్కల రాధాకిషణ్ రావు, ఇంకా ఉదయరాజు శేషగిరిరావు, చొల్లేటి నరసింహ శర్మ ఎందరో ఉండిరి. వీండ్లందరు ఆయన కండ్లకు ఆనలే.

ఇవ్వన్ని ఎందుకు చెప్తున్ననంటే, తెలంగాణ వాండ్ల భాష విషయంలో అవతలవాండ్ల భాష విషయంలో అవతల వాండ్లకు ముఖ్యంగ కోస్తా వాండ్లకు ఏం అభిప్రాయం ఉండెనో తెలిసేతందుకే. నే నెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష, పలుకు బడుల భాష గావాలె. మన యాస మన భాష అన్న అభిమానం ఉండాలె. ఆదిలాబాద్ ఉదారి నారాయణ “ఆకుపచ్చని ఎడారి” అన్న పుస్త కానికి ముందు మాట రాస్తూ గోపి అన్నడు, తెలంగాణ మాండలికం అనుడు తప్పు తెలంగాణ భాష అనాలే అని. అవును తెలంగాణ బతుకు వేరే తెలంగాణ భాష వేరే.. ప్రత్యేక మయినయి.

అసలు రాసేటోడు తెలుగోడయి చదివేటోడు కూడ తెలుగోడయితే సహృదయత ఉంటే తెలుగు అర్ధమయితది. నాకు అర్థం కాలేదంటే నువ్వు తెలుగోనివి కాదన్నమాట. లేకపోతే సహృదయత లేదన్న మాట.

తెలంగాణ భాషంతా ‘తౌరక్యాంధ్ర’మని ఎవడో అన్నడు. ఇపుడు అంటాండ్రు. మరి అట్లయితే నీది తెలుగేనా? చా అంటే తప్పు టీ అంటే తెలుగా? సిల్సిలా అంటే తప్పు సీరియల్ అంటే రైటా? సాల్టు, షుగరు తెలుగే. నాష్త అంటే కొంప మునుగుతది. తోలు కొచ్చీనం అంటే పశువులనే. పోయిం డంటే చావే. కడప గాదు.. గడపంటేనే రైటు. తొవ్వ తప్పు దోవ రైటు. పొక్క లెన్నున్నా బొక్కంటేనే రైటు. మందలించుడంటే తప్పుచేస్తేనేనట. మేరాయన దర్జీ అంటే ఛీఛీ పనికి రాదు టైలర్ అనాలట. ఎప్పట్నుంచో ఉన్న అదాలతులు, కోర్టులంటేనే న్యాయస్థానాలయితయట. ఏమిటిదంతా? కంప్లైంట్ చేసేటోడు ముద్దయి మరి నువ్వు నేరం మోపబడ్డోన్నే ముద్దాయంటున్నవు. ఎన్ని జెప్పొలె ఇట్ల?  – కాళోజీ నారాయణరావు

1950 తెలంగాణా రచయితల సంఘం వార్షికోత్సవంల విశ్వనాథకు రు. 116/- ఇచ్చి సత్కారం చేసినం. ఆ సభల ఆయన ఏమన్నడెరికేనా? ఇయ్యేడు నాకు చేసిండ్రు సన్మానం, వచ్చే ఏడు మరో ఎల్లయ్యకు ఎవనికో చేస్తరు సన్మానం అన్నడు. అంటే తనకు చేసిన సన్మానం ఇంకేవని కన్నా తెలంగాణోనికి చేస్తే వాడు తన తోటి సమానమయితడుగద అది ఆయన మనసుల ఉద్దేశ్యం.

నా భాష, నా యాస, నా బతుకు

నేను గట్లనే మాట్లడ్త, గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె. జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది. తెలంగాణ యాస ఉంటేనే తెలంగాణ సంస్కృతి, జీవితం ఐతదా? రచనల తెలంగాణ సంస్కృతీ,  జీవితం గూడా ఉండాలి అని కొందరంటున్నరు. నీ భాషల్నే నీ బతు కున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆయాసలున్న పలుకు బళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. ఎవని యాసల, ఎవని భాషల వాడు రాయాలె. తెలుస్తదా అన్నది లేనే లేదు. తెలంగాణ భాషల రాయండ్రి, తెలంగాణ భాషల మాట్లాడుండ్రి, తెలంగాణ బతుకు బతుకుండ్రి . ఆఖరున ఒక్కమాట. నా మాటలల్ల అక్కడక్కడ సభ్యత లేదనే ఆక్షేపణ వస్తదని నాకెర్కే కాని నా భాష, నా యాస, నా బతుకు, నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యతగా ప్రవర్తించని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.