'సారే జహాసే అచ్చా' గేయ రచయిత ఇక్బాల్ చాప్టర్ తొలగింపు.. ఢిల్లీ వ‌ర్సిటీ కీలక నిర్ణయం

'సారే జహాసే అచ్చా' గేయ రచయిత ఇక్బాల్ చాప్టర్ తొలగింపు.. ఢిల్లీ వ‌ర్సిటీ కీలక నిర్ణయం

ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని పొలిటిక‌ల్ సైన్స్ విభాగం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 'సారే జ‌హాసే అచ్చా' గేయాన్ని రాసిన ప్రముఖ పాకిస్థాన్ జాతీయ క‌వి మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌ గురించి ఉన్న ఓ చాప్ట‌ర్‌ను సిల‌బ‌స్ నుంచి తొల‌గించాల‌ని ఢిల్లీ యూనివ‌ర్సిటీ అకాడ‌మి మండ‌లి తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. బీఏ డిగ్రీ చ‌దువుతున్న వారికి ఆరో సెమిస్ట‌ర్ పేప‌ర్‌గా ఇక్బాల్ గురించి సిలబస్ లో ఉంది. మాడ్ర‌న్ ఇండియ‌న్ పొలిటిక‌ల్ థాట్ చాప్ట‌ర్‌లో ఆ ప్ర‌ముఖ క‌వి గురించి రాశారు. అయితే ఆ చాప్ట‌ర్ తొల‌గించాల‌న్న దానిపై తుది నిర్ణ‌యం మాత్రం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకుంటుంద‌ని అధికారులు చెప్పారు. యూనివ‌ర్సిటీ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏబీవీపీ కూడా స్వాగ‌తించింది.
 
పాకిస్థాన్ త‌త్వ‌వేత్త‌గా మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌కు గుర్తింపు ఉంది. ముస్లిం లీగ్‌లో జిన్నాను కీల‌క నేత‌గా తీర్చిదిద్ద‌డంలో ఇక్బాల్ ముఖ్య పాత్ర పోషించారు. భార‌త్ విభ‌జ‌న‌లో జిన్నాకు ఎంత బాధ్య‌త ఉందో, అంతే బాధ్య‌త ఇక్బాల్‌పై ఉంటుంద‌ని ఓ విద్యార్ధి విభాగం పేర్కొన్న‌ది. అవిభ‌జిత భార‌త‌దేశంలో 1877లో ఆయ‌న సియాల్‌కోట్‌లో జ‌న్మించారు. పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాల‌న్న ఐడియా కూడా ఈయ‌న‌దే.