టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకం విలువ తగ్గదు

భీమదేవరపల్లి, వెలుగు : ప్రస్తుతం టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకం విలువ మాత్రం తగ్గదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి వారాల ఆనంద్‌‌ చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రంథాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 300కుపైగా పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌‌ ఫోన్‌‌ కారణంగా నేటి యువత సోషల్‌‌ మీడియాకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పుస్తకం చదివితే ఒత్తిడి మొత్తం తగ్గిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యులు డాక్టర్ యదలాపురం తిరుపతి, గొల్లపల్లి లక్ష్మయ్య, తాళ్ల వీరేశం పాల్గొన్నారు.