కల్లోల కడలిలో ఎగసిన  కవితా కెరటం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్‌‌‌‌. ఓ కల్లోల కడలి కెరటం. తలవంచని ధిక్కార గీతం. కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు అద్దుకున్న కవి. ‘అడవి నేను–కడలి నేను’ అంటూ విప్లవోద్యమాన్ని ఆవాహన చేసుకున్నాడు అలిశెట్టి. అగ్ని పద్యమై, దగ్దగీతమై, మంటల జెండాల జాతరై, మందుపాతరై, చీకటి చెరసాలలకు నిప్పంటించే అక్షర కాగడాల్ని కలంలో నింపుకున్నాడు. విముక్తంటే దీర్ఘకాలిక పోరాటమని తెలుసు తనకు. అందుకే ‘ఈ దీర్ఘకాలిక యుద్ధవ్యూహంలో పీడితుడే నా అణ్వస్త్రం’ అని ప్రకటించాడు. అలాగే బతికాడు. చివరిదాకా. జనం బాటలోనే బతికాడు చివరి ఊపిరిదాకా. అలిశెట్టి ప్రభాకర్‌‌‌‌ కరీంనగర్‌‌‌‌ జిల్లా జగిత్యాలలో 1956, జనవరి 12న పుట్టాడు. చేనేత కుటుంబం. ఏడుగురు అక్కాచెల్లెళ్లు. ఇద్దరు అన్నదమ్ములు. ప్రభాకర్‌‌‌‌ ఐదోవాడు. తండ్రి పరిశ్రమల శాఖలో ఉద్యోగి. ప్రభాకర్‌‌‌‌కు పదకొండేళ్ల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. పదహారేళ్లకే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో ఇంటర్మీడియట్‌‌‌‌ చదువును మధ్యలోనే వదిలేశాడు. మొదట్లో చిత్రలేఖనంపై ఆసక్తితో విపరీతంగా సాధన చేశాడు. ఇండియన్‌‌‌‌ ఇంక్‌‌‌‌తో వేసిన చిత్రాలు పత్రికల్లో అచ్చయ్యాయి. అప్పుడే జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయమైంది. ఆ ప్రభావంతో కవిత్వరంగంలోకి వచ్చాడు. కళ్లెదుట జరిగే సంఘటనల్ని కవిత్వంగా అల్లే ఒడుపు తెలిసింది. 

జగిత్యాల జైత్రయాత్రలో..

బతుకుదెరువు కోసం సిరిసిల్లలోని ఓ ఫొటో స్టూడియోలో చేరి మెలకువలు నేర్చుకున్నాడు. జగిత్యాలలో (1975) ‘స్టూడియో పూర్ణిమ’ ప్రారంభించాడు. ఒకవైపు ఫొటోగ్రఫీ. మరోవైపు చిత్రలేఖనం, కవిత్వం. 1975 నుంచీ కవిత్వమే ప్రాణంగా బతికాడు. అతని కవిత్వంలో సరళత, స్పష్టత, సూటిదనం పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. దీంతో అతని పేరు తెలుగు నేలన నలుదిశలా మార్మోగింది. శక్తివంతమైన కవిత్వం రాసే కవిగా ప్రసిద్ధుడయ్యాడు. అది ‘జగిత్యాల జైత్రయాత్ర’ సందర్భం. తన ఇంటి ముందు నుంచే ‘లాంగ్‌‌‌‌ మార్చ్‌‌‌‌’ చేస్తూ వెళ్లిన రైతాంగ జైత్రయాత్రను కళ్లల్లో నింపుకున్నాడు. ‘దున్నేవారికే భూమి’ నినాదం ఆలోచింపజేసింది. వేలాది జనం గొంతుల్లో హోరెత్తిన ‘నక్సల్బరీ ఏకీ రస్తా’ నినాదం కొత్త చూపునిచ్చింది. తను రాయాల్సిన అక్షరాలకు వెలుగు దారైంది. కొత్త పరిచయాలు. యవ్వనోద్రేకాలు. నెత్తురు మండే ఆలోచనలు. అతణ్ని పీడితుల పక్షం నడిపించాయి. మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు, సాయిని ప్రభాకర్‌‌‌‌, నల్లా ఆదిరెడ్డితో భుజం భుజం కలిపి నడిచాడు. జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నాడు.

పెత్తందార్ల దోపిడీని ఎదిరించి..

ప్రభాకర్‌‌‌‌ భావుకుడు. సున్నిత మనస్కుడు. మాటల్లో ఫైర్‌‌‌‌, రాతల్లో ఫైర్‌‌‌‌. ‘సృజన’, ‘ఎరుపు’, ‘అరుణతార’, ‘పిలుపు’, ‘నూతన’ పత్రికలు అతనిలో వర్గదృక్పథాన్ని కలిగించాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, శివసాగర్‌‌‌‌, చెరబండరాజు పాటలు, కవిత్వం దిశానిర్దేశం చేశాయి. ఈ ప్రభావంతో సాహితీ సృజన చేశాడు. 1977లో ‘ఎర్రపావురాలు’ ఎగరేశాడు.1979లో రెపరెపలాడే ‘మంటల జెండా’ల జాతరయ్యాడు. ఎన్ని కష్టాలెదురైనా వెనకడుగు వేయలేదు. తన అక్షరాల్నే కాగడాగా వెలిగించాడు. ఆ వెలుగులో ప్రజల్ని చైతన్యం చేశాడు. భూస్వామ్యం, దొరతనం, దోపిడీ, పీడన, అణచివేత, పితృస్వామ్య దోపిడీని వ్యతిరేకించాడు. మతవర్గ తత్వం, సామ్రాజ్యవాదం, పెత్తందార్ల దోపిడీని ఎదిరించాడు. క్షయతో రోజురోజుకీ శిథిలమయ్యాడు. ఎడతెగకుండా ఉక్కిరిబిక్కిరి చేసే దగ్గుతెరల మధ్యే ఓ నడిరేయి(1993 జనవరి 12)న ప్రభాకరుడు అస్తమించాడు. ఇదీ అలిశెట్టి ప్రభాకర్​ జీవితం, కవిత్వం, నిబద్ధత. కడ దాకా నమ్మిన విలువల కోసం నిలబడ్డ సాహసం అలిశెట్టి.

శివరాత్రి సుధాకర్,
విప్లవ రచయితల సంఘం