కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది.. కవి, గాయకుడు అందెశ్రీ

కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది.. కవి, గాయకుడు అందెశ్రీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది అని కవి, గాయకుడు అందెశ్రీ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జనజాగృతి కళా సమితి కవి సాయంత్రం(సోషల్ మీడియా గ్రూప్) అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో ఏడో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అందెశ్రీ మాట్లాడుతూ.. కవులు సామాజిక పరిస్థితులు, మదిని తొలిచే సరికొత్త ఆలోచనలు, అనుభవాలను కవిత్వం రూపంలో సమాజానికి అందిస్తారని చెప్పారు. 

సినీ రచయిత, కవి మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ.. గొప్ప కవితతో కవి జీవితం పరిపూర్ణమవుతుందని తెలిపారు. సృజనాత్మకతతో కూడిన రచనలు చేయాలని సూచించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు, రచయిత  పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. అక్షర జ్ఞానంతోనే విజ్ఞానం సాధ్యమని, మన పూర్వీకులు సాహిత్యానికి పెద్దపీట వేశారన్నారు. అనంతరం కవులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. 

కడారి సుభాష్ చంద్రబోస్, కవిత బేతి, కనుకుంట్ల శ్రీనివాస్, దేవర కనకయ్య, చావా మంజుల, డాక్టర్ మాలతీలత, అమరగాని మధు, రవి ప్రసాద్, నూకల అశోక్ యాదవ్, లింగాల ఉపేందర్, రాధిక నరేన్, నలంద దాస్,  శ్రీనివాస్, చదువు స్వరూప రాణి పాల్గొన్నారు.