- గతి తప్పిన జీవన విధానాన్ని కవులు, కళాకారులే గాడినపెట్టాలి: జూపల్లి
హైదరాబాద్, వెలుగు: సామాజిక చైతన్యానికి కళలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఇందుకోసం కవులు, కళాకారులు కృషిచేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘విధ్వంస జీవన విధానం– సాంస్కృతిక చైతన్యం’ సదస్సుకు మంత్రి జూపల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంస్కృతి అంటే మన అస్తిత్వమని, ప్రజల జీవన విధానమన్నారు. ప్రజల జీవన విధానం గతి తప్పడం వల్లే అనేక రుగ్మతలు, పెడ ధోరణులు చోటుకుంటున్నాయన్నారు.
సెల్ ఫోన్ చేతిలో యువత బందీ అయ్యారని, సోషల్ మీడియాలో మునుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని వాపోయారు. ‘‘యువత ఆల్ లైన్ గేమ్స్, మత్తుపదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి ఆలోచన, జీవన విధానంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కవులు, కళాకారులు, మేధావులపై ఉంది” అని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటామని మంత్రి చెప్పారు.
ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. సాంస్కృతిక విధాన రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని, దీనిని కవులు, కళాకారులు ముందుకు తీసుకుపోవాలన్నారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు బలహీనంగా మారి ఆత్మహత్య చేసుకుంటున్నారని, యువత ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ కు బానిసలై డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. కులమత విద్వేషం, అసహనం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ జి.వెన్నెల మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు విలువల గురించీ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సమాజ హితం కోసం కవులు, కళాకారులను భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజలా మాట్లాడుతూ ప్రజలను జాగృతం చేసే బాధ్యత, కవులు, కళాకారులపై ఉందని, దీనికి సంగీత నాటక అకాడమీ తోడ్పాటు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి జయరాజు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ భాషా, సాంస్కృతిక డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డాక్టర్ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.