కవి, రచయితలకు స్వేచ్ఛలేదు.. జైలుకెళ్లే పరిస్థితి ఉంది

  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల అందుకున్న తెలుగు రచయిత నిఖిలేశ్వర్ 
  • అగ్నిశ్వాస రచనకు గాను విశిష్ట పురస్కారం ప్రదానం
  • దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందిన నిఖిలేశ్వర్

న్యూఢిల్లీ: ప్రస్తుత సమాజంలో కవులు, రచయితలకు స్వేచ్ఛ కనిపించడం లేదని..  జైలుకెళ్లే ప్రమాదం మెడపై కత్తిలా వేలాడుతోందని ప్రముఖ తెలుగు రచయిత నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రచయితలు పదవుల కోసం ఎగబడుతున్నాని.. పాలక వర్గాలకు భజన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో 2020 సంవత్సరానికి 24 భాషలకు చెందిన రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం జరిగింది. ప్రముఖ తెలుగు రచయిత నిఖిలేశ్వర్ ‘‘అగ్నిశ్వాస’’ రచనకు గాను ఈ అవార్డు లభించింది. తెలుగులోనే కాకుండా, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ రచనలు నిఖిలేశ్వర్ చేశారు. జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య వంటి దిగంబర కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నిఖిలేశ్వర్ అసలు పేరు కె.యాదవరెడ్డి. కేంద్రమాజీ మంత్రి వీరప్ప మొయిలీని కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. బాహుబలి అహింసా దిగ్విజయం కవితా రచనకు గాను కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ ఏ నాటికైనా నా శ్వాస.. అగ్నిశ్వాస.. ప్రజా పోరాటాల ధ్యాసే నా లక్ష్యం.. రచయిత లేదా కవి తన రచనలతో వ్యక్తి నుంచి సమిష్టిలోకి ప్రవేశిస్తారు. కుల, మతాల వైరుధ్యాలున్న ఈ వ్యవస్థలో రచయిత ఎంతో బాధ్యతతో దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుందని.. ప్రసతుతం రచయితలు, కవులు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు, పాలకులు రచయితలు, కవుల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని.. వారి పట్ల ఏ మాత్రం వ్యతిరేకత కనిపించినా అసహనంతో ఊగిపోతుననారని తెలిపారు. తమ తప్పిదాలను ఎత్తిచూపితే సహించలేని పరిస్థితి ఉందని.. పొరపాటున తప్పిదాలను ఎత్తిచూపితే జైలుకు పంపేందుకు వెనుకాడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కుల మతాలు ఎలా ఏర్పడ్డాయో రచయితల్లో కూడా అదే తరహాల్లో వర్గీకరణ జరిగిందని ఆయన పేర్కొన్నారు.