- గాలి, నీరు, నేల అన్నీ కలుషితం
- పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం
- గింజ రాల్చే వరి.. గెల వేయని కొబ్బరి
- ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని గత పాలకులు
- గతంలో నేరుగా పీఎంవోకే ఫిర్యాదు చేసిన రైతులు
- ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ.. కేంద్రానికి నివేదిక
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని పచ్చని పల్లెలను కాలుష్యం కమ్మేస్తోంది. చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో వెలసిన ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. ఇక్కడి గడ్డి మేసి, నీళ్లు తాగే బర్లకు గర్భం నిలవడం లేదు. జీవాలు గట్టి పేడ వేసి చాలా కాలమైంది. కొబ్బరి చెట్లు గెలలు వేయడం లేదు. ఇక్కడ పండే వడ్లు, కూరగాయల్లో రసాయన ఆనవాళ్లు ఉంటాయనే ప్రచారంతో మిల్లర్లు, వ్యాపారులు కొనడం లేదు. మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపైనా ప్రభావం పడి సంతానలేమికి కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు.
కంపెనీలు నిబంధనలు పాటించకపోవడం వల్లే సమస్య తీవ్రత పెరుగుతున్నా మామూళ్ల మత్తులో నాటి పాలకులు, ఆఫీసర్లు నోరు మెదపలేదు. దీంతో నేరుగా ఇక్కడి రైతులు పీఎం ఆఫీస్‌కు ఫిర్యాదు చేయడంతో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఆఫీసర్లు నిరుడు సర్వే నిర్వహించి, కేంద్రానికి నివేదిక అందించారు.
2 మండలాల్లో 70కిపైగా ఫార్మా కంపెనీలు..
చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం, కొయ్యలగూడెం, ధర్మాజిగూడెం, లింగోజిగూడెం, అంకిరెడ్డి గూడెం, ఆరెగూడెం, కాట్రేవు, పంతంగి, స్వాములవారి లింగోటం, మందోళ్లగూడెం, భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం, బీబీనగర్ పారిశ్రామికవాడ, చిట్యాల, వెలిమినేడు, పిట్టంపల్లి, గుండ్రాంపల్లి, ఏపూరులలో దాదాపు 70కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దోతిగూడెం, అంతమ్మ గూడెం.. ఈ రెండు గ్రామాల్లోనే 10 వరకు ఉన్నాయి. ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన యజమానులు మాట నిలబెట్టుకోలేదు. బిహార్, ఒడిశాకు చెందిన కార్మికులను రప్పించుకొని పనులు చేయించుకుంటున్నారు.
పెరిగిన కాలుష్యం
ఇక్కడున్న ఫార్మా కంపెనీల్లో ఏ ఒక్క దానిలోనూ కాలుష్య నియంత్రణ యూనిట్లు లేవు. ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని కంపెనీలు వందల ఫీట్ల బోర్లు వేసి, విషపూరిత వ్యర్థాలను నేరుగా భూమిలోకి పంపిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ప్రమాదకరమైన వ్యర్థాలను రాత్రిపూట దగ్గరలోని పిల్లాయిపల్లి కాలువలోనూ, చెరువుల్లోనూ పారబోస్తున్నాయి. ఈ కెమికల్స్‌తో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. దోతిగూడెంలోని ఓ కంపెనీ ఏకంగా కొంత భూమి కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ కట్టింది. ఈ స్థలంలో గోతులు తవ్వి వ్యర్థాలను నింపుతోంది. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మట్టి కప్పి గోతులు పూడ్చేస్తోంది. నీటి కాలుష్యం వల్ల ఇక్కడ పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఈ నీళ్లతో పండించిన వడ్లలో నూక ఎక్కువ వస్తుండటం, విష రసాయనాలు ఉంటాయనే ప్రచారంతో మిల్లర్లు ఇక్కడి ధాన్యం కొనడం లేదు.
యజమానులతో పీసీబీ ఆఫీసర్లు కుమ్మక్కు
ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆఫీసర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జనం ఆందోళన చేసిన సందర్భాల్లో ఒకటి రెండు సార్లు ఫ్యాక్టరీలను సీజ్చేసినా నెల రోజుల్లోనే తెరచుకుంటున్నాయి. ఫ్యాక్టరీ ఓనర్లతో పొలిటికల్ లీడర్లకూ దోస్తానా ఉంది. లోకల్ లీడర్ల ఖర్చులన్నీ కంపెనీలే భరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు లీడర్లు, అటు ఆఫీసర్ల అండతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
పీఎంఓ కు ఫిర్యాదు
కాలుష్యంపై స్థానికులు, రైతులు ఎన్నిసార్లు కలెక్టర్, పీసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో రెండేళ్ల కింద అంతమ్మ గూడెం, దోతి గూడెం రైతులు ప్రధానమంత్రి ఆఫీసు(పీఎంఓ)కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పీఎంవో వెంటనే దర్యాప్తు చేయాలని పొల్యూషన్ కంట్రోల్బోర్డును ఆదేశించింది. 2022 జనవరిలో ఆఫీసర్లు విచారణ చేశారు. చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమల కాలుష్యం, దాని వల్ల జరుగుతున్న నష్టాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. నీరు, మట్టి శాంపిల్స్ కూడా సేకరించారు. బోర్ల నుంచి వచ్చే నీరు తాగడానికి ఏ మాత్రం పనికిరావని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దోతిగూడెం గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి తన బోరు నీళ్లు కలుషితం కావడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమనపల్లిలోని పిలాయిపల్లి కాలువ నుంచి పైప్‌లైన్ వేసుకున్నారు. పైపులైను కోసం దాదాపు రూ.35 నుంచి 40 లక్షలు ఖర్చయ్యాయి రాజగోపాల్ రెడ్డి సీరియస్ పిలాయిపల్లి కాలువలో పరిశ్రమల కాలుష్యాన్ని వదులుతున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇటీవల కాలువను పరిశీలించారు.
పశువుల్లో గర్భస్రావం..
కలుషిత నీటిని తాగడం వల్ల బర్లలో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నది. దీంతో అవి కట్టే(గర్భందాల్చే) పరిస్థితి లేదని, కట్టినా గర్భస్రావం అవుతోందని వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నారు. పశువుల కిడ్నీలు, లివర్‌పై ప్రభావం పడుతోందని, ఆకలి మందగించి మేత మేయడంలేదని, పాలు కూడా సరిగా ఇవ్వలేవని అంటున్నారు. ఈ నీళ్లు తాగిన మేకలు పుర్రుకొడుతున్నాయని కాపరులు చెప్తున్నారు. కాలుష్యజలాలతో పశువులు బలహీనమవుతుండటంతో రైతులు గర్భం దాల్చిన బర్లనే బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు. అవి ఈని.. దూడలకు పాలు ఇచ్చేవరకు ఉంచుకుని అమ్మేస్తున్నారు. ఇక్కడి బోర్ల నీళ్లు పశువులు తాగకపోవడంతో వాటి కోసం దూరప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెప్పించుకుంటున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంవల్ల కొబ్బరి చెట్లు గెలలు వేయడం లేదు. ఈ ఫ్యాక్టరీల కాలుష్యం మనుషుల ఆరోగ్యం మీదా తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలామంది శ్వాసకోశ, చర్మ వ్యాధులతో బాధ పడుతున్నారు. కంపెనీల్లో పని చేసే వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంది. శారీరకంగా బలహీనం కావడంతో పాటు లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మహిళలు, పురుషుల హార్మోన్లపై ప్రభావం పడి సంతానలేమికి కారణమవుతోందని అంటున్నారు. కూలీలంతా ఇతర రాష్ట్రాల వారు కావడంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు.
పశువులు తాగేందుకు నీళ్లు కొంటున్నం
మాకు ఎనిమిది ఎకరాలు ఉంది. కానీ పంట సరిగా పండదు. గతంలో వరి వేస్తే ఏటా రూ. 5 లక్షలకు పైగా ఇన్‌కం వచ్చేది. ఇప్పుడు రూ. లక్ష కూడా రావడం లేదు. తాగేనీళ్లకు కరువొచ్చింది. మాతో పాటు పశువులు తాగేందుకు కూడా నీళ్లు కొంటున్నాము.
- చొప్పరి నర్సింహా, రైతు, భాస్కర్, పాండు, రైతు కొడుకులు
రోగాలొస్తున్నాయి
ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో చాలా నష్టాలున్నాయి. కంపెనీల్లో పని చేసేవారు శారీరకంగా బలహీనమవుతున్నారు. మగవారికి లైంగిక, సంతాన సంబంధ సమస్యలు వస్తాయి. చాలా మంది ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. ఈ నీళ్లు తాగితే శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి.
-డాక్టర్ కాటం రాజు, పీహెచ్సీ, పోచంపల్లి