విద్యార్థులు తాగే నీళ్లలో విష ప్రయోగం..ఉపాధ్యాయుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

విద్యార్థులు తాగే నీళ్లలో విష ప్రయోగం..ఉపాధ్యాయుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి ప్రైమరీ స్కూల్​లో ఘటన 
  • నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు 

ఆదిలాబాద్, వెలుగు: విద్యార్థులు తాగే నీళ్లలో విష ప్రయోగం చేయడం కలకలం రేపింది. ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం స్కూల్​ టీచర్లు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆదివారం, సోమవారం సెలవుల తర్వాత మంగళవారం ఉదయం బడి తెరుచుకుంది. వంట గది తాళం పగలగొట్టి ఉండడం, ఒక బకెట్ లో తెలుపు రంగులో నీళ్లు ఉండడంతో వాటర్  ట్యాంకులో, తాగునీటి నల్లాల వద్ద, వంటగది సామాగ్రిపై పురుగు మందు కలిపినట్లు టీచర్లకు అనుమానం వచ్చింది.

దీంతో గ్రామ మాజీ సర్పంచ్, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చి పురుగుల మందు అని తేల్చారు. ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. హెచ్ఎం ప్రతిభ ఇచ్చోడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు, గోండుగూడ గ్రామానికి చెందిన సోయం కిష్టును అరెస్ట్​చేశారు. కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో వారిపై ఉన్న కోపంతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేశ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.