లారీల్లో తెచ్చి, పైపులైన్లు వేసి.. మూసీలోకి కెమికల్స్​ డంపింగ్​

లారీల్లో తెచ్చి, పైపులైన్లు వేసి.. మూసీలోకి కెమికల్స్​ డంపింగ్​
  • అత్తాపూర్​ ఏరియాలో నడుస్తున్న తతంగం
  • మాటువేసి పట్టుకున్న స్థానికులు

గండిపేట్, వెలుగు: ఫ్యాక్టరీల సిబ్బంది మూసీలో కెమికల్స్ డంప్​చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్​తీసుకువచ్చి లారీలను అడ్డుపెట్టి మరీ నదిలోకి పైపులైన్​వేసి ఈ తతంగం నడిపిస్తున్నారు. కొన్నేండ్లుగా షాద్‌నగర్, బాలానగర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి లారీలు అత్తాపూర్‌ సమీపంలోని మూసీకి తెల్లవారుజామున చేరుకుంటున్నాయి. రోజుకు ఐదు నుంచి 10 వరకు లారీల్లో కెమికల్స్​ తీసుకువచ్చి.. ఎవరికీ కనిపించకుండా కొన్ని లారీలను అడ్డుపెట్టి పైపులైన్​వేసి నదిలో కలుపుతున్నారు. 20 వేల లీటర్ల కెమికల్​డంప్​చేయడానికి లారీల యజమానులు ట్రిప్‌కు రూ.25 వేలు తీసుకుంటున్నారు.

ఈ కెమికల్స్​లో హైడ్రో క్లోరిడ్‌, ఇతర యాసిడ్స్​ఉంటున్నాయి. ఇది గుర్తించిన కొందరు స్థానికులు సోమవారం అర్ధరాత్రి మాటువేశారు. తెల్లవారుజామున కెమికల్స్​తో వచ్చిన లారీలను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ పోలీసుల దృష్టికి తెచ్చారు. ఆరేండ్ల నుంచి ఈ దందా కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు. కాగా, మూసీ నదిలో కెమికల్స్‌ కలుపుతున్నారన్న ఫిర్యాదు వచ్చిందని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కాస్ట్రో వెల్లడించారు.