
- ఇటు వ్యాధులు.. అటు వాగులు.. గోసవడ్తున్న అడవి బిడ్డలు
- ఏజెన్సీ గ్రామాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు
- దవాఖాన్లకు వెళ్లేందుకు అడ్డుతగులుతున్న వాగులు, బురద రోడ్లు
- అష్టకష్టాల మీద ఎడ్ల బండ్లు, డోలీల్లో పేషెంట్ల తరలింపు
- పీహెచ్ సీల్లో అరకొర వైద్య సేవలు.. గాల్లో కలుస్తున్న నిండు ప్రాణాలు
- కాగితాలకే పరిమితమైన వాగులపై వంతెనలు
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: వరుసగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ గ్రామాల్లో విషజ్వరాలు, డయేరియా విజృంభిస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని వందలాది గూడాలు, తండాల్లో అడవి బిడ్డలు మంచంపట్టారు. సీరియస్ గా ఉన్నవాళ్లను దవాఖాన్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నా.. వాగులు, బురదరోడ్లు దాటనివ్వడం లేదు. వాగులపై వంతెనల కోసం, రోడ్ల రిపేర్ల కోసం సర్కారుకు ప్రపోజల్స్ పంపి ఏండ్లు గడుస్తున్నా శాంక్షన్ కావడం లేదు. దీంతో సుమారు 300కు పైగా అటవీ గ్రామాల్లోకి అంబులెన్స్‌లు కాదుకదా, ఆటోలు కూడా రావడం లేదు. గిరిజనులే అష్టకష్టాలు పడి ఎడ్ల బండ్లలో, డోలీల్లో రోగులను సమీప పీహెచ్‌సీలకు తరలిస్తున్నా.. అక్కడికి వెళ్తే అరకొర వైద్యమే దిక్కవుతున్నది. 24 గంటల పీహెచ్‌సీల్లోనూ సాయంత్రం 5 దాటిందంటే ఏఎన్ఎంలు తప్ప డాక్టర్లు ఎవరూ అందుబాటులో ఉంటలేరు.
తాజా వర్షాలు, వరదల వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని బేల, జైనథ్ , బోథ్, ఇచ్చోడ, తాంసి తలమడుగు, భీంపూర్ మండలాల్లో దాదాపు 80 గ్రామాల దాకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు దెబ్బతిని మరో 56 గ్రామాలకు రాకపోకలు బంద్అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 51 రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 96 కోట్లతో ప్రపోజల్స్ పంపి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఫండ్స్రిలీజ్ కాలేదు. నిరుడు వాగులు దాటుతూ ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో 10 మంది చనిపోయారు. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్‌పేట, సిర్పూర్‌టి, కాగజ్‌నగర్, దహేగాం, కెరమరి, ఆసిఫాబాద్ మండలాల్లోని సుమారు 20 ఊర్లు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సుమారు 35 వాగులపై వంతెనల నిర్మాణం కోసం రూ.250 కోట్లతో ప్రపోజల్స్ పంపించి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వలేదు.
చింతలమానేపల్లి మండలం దిందా గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు పొంగి, రోజుల తరబడి రాకపోకలు బంద్అవుతున్నాయి. బ్రిడ్జి మంజూరు అయినా పనులు మొదలు కాలేదు. గతంలో రామకృష్ణ అనే యువకుడు వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయాడు. దహెగాం మండలంలోని లోహ గ్రామస్తులకు దవాఖానకు పోవాలంటే ఎడ్ల బండ్లే దిక్కవుతున్నాయి. ఈ నెల 16న గ్రామానికి చెందిన నిండు గర్భిణి మడే ప్రమీలకు పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను పిలిచారు. రోడ్డు సరిగ్గా లేక అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు గర్భిణిని ఎడ్లబండిపై లోహ నుంచి కర్జి వరకు ఆరు కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్సులో దహెగం పీహెచ్ సీకి తరలించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పెంకా వాగు, పుసు వాగు పొంగుతుండడంతో 5గ్రామాలకు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 115 కోట్లు కావాలని ప్రపోజల్స్ పంపినా సర్కారు నుంచి ఫండ్స్ రాలేదు.
ఇక భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్ద వాగు పై వంతెన లేక 10 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 5 కోట్లతో ప్రపోజల్స్ పంపినా నేటికీ ఫండ్స్ రాలేదు. ఇదే మండలంలోని కోనంపేట అలుగు వాగు పొంగి 12 గ్రామాలకు రాకపోకలు బంద్అయ్యాయి. ఈ బ్రిడ్జి కోసం రూ. 1.50 కోట్లు మంజూరైనా నేటికీ పనులు మొదలుకాలేదు. ఇక కొర్లకుంట, దొబ్బలపాడు మధ్య అలుగువాగు పై రూ.5 కోట్లతో ప్రపోజల్స్ పంపించినా నేటికీ ఫండ్స్ రాలేదు. దీంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇలా ఈ నాలుగు జిల్లాల్లోని సుమారు 300 గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కాదు కదా, కనీసం ఆటోలు కూడా వెళ్లలేకపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వైద్య సిబ్బంది కూడా రాలేని పరిస్థితి. దీంతో గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎడ్ల బండ్లు, డోలీల్లో రోగులను, గర్భిణులను వాగులు దాటించాల్సి వస్తున్నది.
ప్రబలుతున్న విషజ్వరాలు
ప్రస్తుతం ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు విషజ్వరాలతో బాధపడ్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ బాధితులు వందల సంఖ్యలో ఉంటున్నారు. ములుగు, భూపాలపల్లి లాంటి జిల్లాల్లో డయేరియా కూడా విజృంభిస్తున్నది. వర్షాల వల్ల పారిశుధ్యం లోపించడం, గిరిజనుల్లో పోషకాహార లోపం ప్రధానంగా వ్యాధులకు కారణమవుతున్నాయి. వాగులు పొంగడం, రోడ్లు బాగా లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేక ఆరోగ్యం విషమిస్తున్నది. వాగులు, బురద రోడ్లను దాటేందుకు సాహసం చేసి ఆసుపత్రులకు వెళ్తే సరైన వైద్యం అందడం లేదు. ఆదిలాబాద్జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. జ్వర లక్షణాలతో ఆదిలాబాద్ రిమ్స్ కు వందలాది గిరిజనులు క్యూ కడ్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అఫీషియల్‌గా 25 డెంగీ కేసులు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు సీహెచ్ సీలు, 20 పీహెచ్ సీలు ఉండగా వీటిలో సరిపడా డాక్టర్లు లేరు. ఆసిఫాబాద్సీహెచ్ సీలో 47 మంది డాక్టర్లకు గాను 13 మంది, సిర్పూర్(టీ) సీహెచ్ సీలో17 మందికి గాను నలుగురు డాక్టర్లు మాత్రమే సేవలు అందిస్తున్నారు.
20 పీహెచ్‌సీల పరిధిలో 46 మందికి గాను 22 మంది డాక్టర్లే ఉన్నారు. ఒక్కో సీహెచ్ సీలో డెయిలీ 250 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతున్నది. పీహెచ్‌సీలకు కూడా జ్వరాలు, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులతో బాధితులు క్యూ కడుతున్నారు. ఏమాత్రం సీరియస్‌గా ఉన్నా అక్కడి సిబ్బంది జిల్లా కేంద్రానికి రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అన్ని చోట్ల సరిపడా డాక్టర్లు ఉన్నారు. కానీ డాక్టర్లు ఎవరూ స్థానికంగా ఉండకపోవడం సమస్యగా మారింది. డాక్టర్లు, సిబ్బంది అంతా వరంగల్, హనుమకొండ లాంటి సిటీల్లో ఉంటూ తమకు ఇష్టం వచ్చిన టైంలో డ్యూటీలకు వచ్చిపోతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో సుమారు 10 దాకా 24 గంటల పీహెచ్ సీలు ఉన్నప్పటికీ సాయంత్రం 5 దాటితే ఇక్కడ వైద్యం అందడం లేదు.
ఏజెన్సీ గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
వర్షాకాలంలో వాగులు పొంగి గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయితున్నయ్. చాలా గ్రామాల్లో టైంకు ట్రీట్మెంట్ అందక గిరిజనులు చనిపోతున్నరు. అందుకే వానాకాలం పూర్తయ్యేదాకా ఏజెన్సీ గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్యసేవలు అందించాలి.
‒ కారం పుల్లయ్య, టీఏజీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ములుగు జిల్లా
వానొస్తే పక్కఊరికి కూడా పోలేం
బజార్ హత్నూర్, కొత్తపల్లి మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నోసార్లు అధికారులు, లీడర్లను కలిసి వేడుకున్నం. వాగులో నీటి ప్రవాహం పెరిగితే మండల కేంద్రానికి రాకపోకలు బందైతున్నయ్. కనీసం పక్క ఊరికి కూడా పోలేకపోతున్నం.
- సీడం అర్జున్, కొత్తపల్లి, బజార్హత్నూర్మండలం, ఆదిలాబాద్జిల్లా
బాధలు ఎవ్వలకు చెప్పుకోవాల్నో తెలుస్తలే
ఏన్నో ఏండ్ల సంది మా గుండి వాగుపై నిర్మిస్తున్న వంతెన పూర్తయితలేదు. ఎన్నిసార్లు చెప్పిన ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకుంటలే. గట్టిగా వాన పడ్తే వాగు దాటలేం. ఆ టైంలో జ్వరం వచ్చినోళ్లు, గర్భిణులు గోస పడుతున్నరు. అత్యవసర పరిస్థితుల్లో వాంకిడి మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నం. మా బాధలు ఎవ్వలకు చెప్పుకోవల్నో తెలుస్తలేదు.
- జాడి లక్ష్మి, గుండి గ్రామస్తురాలు, ఆసిఫాబాద్‌జిల్లా
వాగు దాటలేక.. ఆగిన ఊపిరి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ అనుబంధ గ్రామమైన నాయికపుగూడకు చెందిన దొసంగుల అశోక్(20) మూడు రోజులు తీవ్ర కడుపు నొప్పితో అల్లాడిండు. కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకుపోదామని గురు, శుక్ర, శనివారాల్లో ప్రయత్నించగా.. బాబాసాగర్, నాయికపుగూడ మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటనియ్యలేదు. ట్రీట్మెంట్అందక శనివారం సాయంత్రం ఇంటి దగ్గరే అశోక్ చనిపోయిండు. ఈ వాగు మీద రూ. 2 కోట్లతో మూడేండ్ల కింద మొదలుపెట్టిన హైలెవెల్ బ్రిడ్జి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
ప్రాణాలకు తెగించి..!
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న కుర్సం సిద్ధు(17)ను వైద్య చికిత్స కోసం వాగు దాటిస్తున్న యువకులు వీళ్లు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిప్పాపురం పంచాయతీ వద్ద వాగు పొంగడంతో ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు బందైనయ్. సీతారాంపురం గ్రామానికి వెళ్లే రహదారిపై కుంకుమ మడుగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కట్టెకు జోలె లాగా కట్టి అందులో సిద్దును వేసుకొని అటు, ఇటు మోసుకుంటూ ప్రాణాలకు తెగించి దవాఖానకు తీసుకెళ్లారు. వారి సాహసంతో సిద్దు ప్రాణాలు దక్కాయి.