సమస్యలకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు

సమస్యలకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు

ప్రత్యేక  తెలంగాణ ఏర్పడినాక మన నిధులు మనమే కేటాయించుకుని వాడుకునే వ్యవస్థ ఏర్పాటైంది.  దాదాపు 12 బడ్జెట్లు వచ్చాయి.  అయితే, బడ్జెట్ల ద్వారా సామాజిక మార్పు, న్యాయం, సమానత్వంతో కూడిన  అభివృద్ధి, పర్యావరణ అనుకూల ప్రగతి దిశగా నిధులు కేటాయించాల్సి ఉండగా ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయడం లేదు.  బడ్జెట్ ప్రాధాన్యతలలో  స్వల్పమార్పులతో  మొదలై ఒక సుస్థిర దిశకు  మార్గం సుగమం చేసే ఆలోచన కూడా కనపడడం లేదు. 

ఉన్నత చదువులు చదివి, సుదీర్ఘ శిక్షణ తీసుకుని, విస్తృత అనుభవం గడించిన ఉన్నతాధికారులు కూడా మార్పుకు తమ పాత్ర పోషిస్తలేరు. సరి అయిన సలహాలు ఇస్తలేరు. నిర్ణయాలు తీసుకునే పాలకులు, వాటిని అమలుచేసే అధికారులు ఈ రెండు వర్గాలు విస్తృత సంప్రదింపులు చేస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి.

 సాధారణంగా  ప్రభుత్వ పాలనా విధానాలు, దార్శనిక పత్రాలు, ఆర్థిక, సామాజిక సూత్రాలు, చట్టాలు వగైరా అంశాలతో  కూడినదై ఉంటుంది.  దీనికి కావాల్సిన వనరులు సమకూర్చుకోవడంలో ఒక వ్యూహం ఉంటుంది. ఏ పని చేసినా నిధులు, నిపుణులు, సిబ్బంది అవసరం ఉంటుంది. ఒకప్పుడు పంచవర్ష  ప్రణాళికల ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రకటితం అయ్యేవి.  వాటిని చర్చించేవారు. 

ఇప్పుడు వార్షిక ప్రణాళికలు కూడా లేవు. కేవలం నిధుల కేటాయింపు ప్రక్రియకే  ప్రజాస్వామ్య ప్రక్రియను పరిమితం చేశారు. తెలంగాణలో సుస్థిర అభివృద్ధి గురించి స్థానిక ఆలోచనలను క్రోడీకరించి, తగిన విధానాలు తీసుకురాగలిగే  వ్యవస్థీకృత పద్ధతి మనం అవలంబించలేకపోతున్నాం.  అది చాలా పెద్ద లోపం.  ఈ లోపం  ప్రతి బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పన్ను ఆదాయం 2015-–16లో రూ.59,318 కోట్ల నుంచి 2025-–26 నాటికి రూ.1,75,319.35 కోట్లకు పెరిగింది. పన్నుయేతర ఆదాయం అంచనా 2015–-16 లో రూ.22,413.27 కోట్ల నుంచి ఇప్పటికి రూ.31,618.77 కోట్లకు పెరిగింది.  అయినా నిధులు సరిపోవడం లేదు. 

వనరుల విధ్వంసం

2014–-15 నుంచి సాగునీటి శాఖకు ఇప్పటివరకు  బడ్జెట్ ద్వారా ఇచ్చిన నిధులు రూ.2,24,102 కోట్లు.  ఇంకా సాగునీటి  ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులు అదనం.  కేవలం  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికే  రూ.2 లక్షల కోట్లు దాటింది అని అప్పటి అంచనా.  2016లో శాసనసభలో ప్రభుత్వం చేసిన ఒక ప్రకటనలో 6 లక్ష్యాలు సాధిస్తామన్నారు.  వచ్చే 3 లేదా 4 ఏండ్లలో అన్ని పెద్ద, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి వ్యవసాయానికి నీళ్ళు ఇస్తామన్నారు.  

కరువు ప్రాంతాలతో సహా రాష్ట్రమంతటా గోదావరి,  కృష్ణ నీళ్లు సరఫరా చేస్తామన్నారు. పాత ప్రాజెక్టులను ఆధునీకరిస్తామన్నారు.  రెండు నదుల మీద ఆనకట్టల ద్వారా వచ్చే నీళ్ళను ఆపుకుని, ఎత్తిపోసుకుని తెచ్చుకుంటామన్నవే. 12 ఏండ్లలో  ఆ పనులు కూడా పూర్తికాలే.  కృత్రిమ నీటి సరఫరా వ్యవస్థ ఏర్పడలేదు. నీటి కొరత తీరలేదు. 

ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సహజ వనరుల విధ్వంసం జరుగుతున్నది. లక్షల టన్నుల సారవంతమైన మట్టి కోల్పోయింది. ఇసుక మిగిలింది. అయినా కూడా ఈ పద్ధతిని సమీక్షించకుండా 2025–-26లో ప్రజల నుంచి వచ్చిన ఆదాయంలో సింహభాగం రూ.23,330 కోట్లు సాగునీటి శాఖకు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎంతవరకు సమంజసం?

విత్తన సబ్సిడీలు లేవు

రైతులు ఎదుర్కొంటున్న నిత్య సమస్యలకు అవసరమైన నిధులు ప్రతి బడ్జెట్లో ఉండడం లేదు. వ్యవసాయ అనుబంధ శాఖలకు నిధులు ఇస్తున్నట్లున్నా ఫలితాలు సాధించే పెట్టుబడులు కావు. ప్రకృతి వైపరీత్యాలకు రైతు నష్టపోతే నష్ట పరిహారం తక్షణమే అందించే బీమా పథకం అసలు పని చేయడం లేదు.  రైతుల కష్టాలకు అంతిమ మార్గమైన ప్రకృతి వ్యవసాయం మీద ప్రభుత్వ పెట్టుబడులు లేనే లేవు. 2025–-26 బడ్జెట్లో  ప్రకృతి వ్యవసాయానికి కేటాయింపులు లేవు. 

విత్తనాల అభివృద్ధికి, రైతులకు మంచి విత్తనాలు అందించేందుకు కూడా పెట్టుబడులు లేవు. ఇదివరకు ఇచ్చిన విత్తన సబ్సిడీలు లేవు. రెండుసార్లు ఋణమాఫీ పథకం పెట్టినా ఋణ విముక్తులు అయిన తెలంగాణ రైతులను గుర్తించడం కష్టంగా మారింది.  ఈ పరిస్థితి పథకంలో అవినీతి వల్ల జరుగుతున్నదా లేక దోపిడీ అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నదా అనే ప్రశ్న మీద ప్రభుత్వ సమీక్ష లేదు.  

రైతులకు ఇచ్చే ఎకరాకు రూ.5 వేలు లేదా రూ.7,500 తనకు అయ్యే ఖర్చులో చాలా తక్కువ.  మార్కెట్లో ధర రాక రైతు కోల్పోతున్నది అంతకంటే ఎక్కువ. 2025-–26 బడ్జెట్లో మార్కెటింగ్ శాఖలో పథకాలు లేవు. సిబ్బంది జీతభత్యాలకు, ఆఫీసు ఖర్చులకు  మాత్రం రూ.14 కోట్లు ఇచ్చారు.  సెరికల్చర్  పరిస్థితి కూడా ఇంతే.  పట్టు పరిశ్రమ అభివృద్ధి వల్ల అనేక సత్ఫలితాలు వస్తాయి. సిబ్బంది జీతభత్యాలకు, ఆఫీసు ఖర్చులకు  రూ.28  కోట్లు ఇస్తే వారు అమలుచేసే పట్టు పురుగు పెంపకం పథకాలకు ఇస్తున్నది కేవలం రూ.21 కోట్లు.  మల్బరీ తోటలకు అధిక కేటాయింపులు జరిపి  తగినవిధంగా సిబ్బందిని ఉపయోగిస్తే మంచిది. 

విత్తన కార్పొరేషన్​కు నిధుల కొరత

 వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి శాఖ ఒకటి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు కృత్రిమంగా కురిపించడానికి ఏర్పాటు చేసిన ఈ శాఖ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ శాఖకు గత 2021–-22 నుంచి ఇప్పటివరకు కేటాయించిన రూ.2.2 కోట్లు దేనికి ఉపయోగపడతాయో ఎవరికీ తెలవదు. 

2025-–26లో కూడా సిబ్బంది జీతభత్యాలకు రూ.53 లక్షలు ఇచ్చింది. తక్కువనే కదా అనిపించవచ్చు. కానీ, అవసరమైన, ఉపాధి సంరక్షించాల్సిన చేనేత రంగానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం అవసరమే లేని శాఖను రద్దు చేయకుండా నిధులు ఇవ్వడం శోచనీయం. ఇట్లాంటి కేటాయింపులు అనేకం ఉన్నాయి. 

విత్తనాల సరఫరాకు, విత్తన కార్పొరేషన్ ఆర్థిక జవసత్వాలకు నిధులు లేవు అని కుంటి సాకు చెప్పే ప్రభుత్వం చక్కెర కమిషనర్ ఆఫీసును  కోట్ల రూపాయల కేటాయింపులతో బతికిస్తున్నది. చక్కెర కమిషనర్ ఆఫీసుకు 2021-–22 నుంచి 2023–-24 మధ్య ఇచ్చింది రూ.21.64 కోట్లు. బహుశా ఏ ఆఫీసు కూడా ఇంత ఖరీదు అయినది ఉండకపోవచ్చు.  

ప్రభుత్వ రంగంలో చెరుకు మిల్లులు ఏనాడో మూతపడ్డాయి. చెరుకు విస్తీర్ణం కూడా ఎక్కువ లేదు. మరి ఈ ఆఫీసు ఎవరికోసం పని చేస్తున్నది. దానికి విధిగా అన్ని నిధులు ఎందుకు ఇస్తున్నారు? 2024–-25, 2025–-26 సంవత్సరాలకు కలిపి రూ.278 కోట్లు నిజాం చక్కెర ఫాక్టరీ కోసం ఇస్తున్నారు. ఫలితం గురించి వేచి చూడాల్సిందే.

సహజ వనరులపై దృష్టి సారించాలి

ఆధునిక తెలంగాణలో ప్రజలకు తెలియాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. కేవలం ప్రభుత్వ నిధుల కేటాయింపు మాత్రమే కాదు. భూమి, నీరు వంటి ప్రకృతి వనరుల ఉపయోగం గురించి కూడా తెలవాలి.  నీటి కొరత పెరుగుతున్న తరుణంలో నీటికి కూడా ప్రతి ఏటా బడ్జెట్ పెట్టి దేనికి ఎంత వాడుతున్నామో తెలుసుకుని తగినవిధంగా సామాజిక న్యాయం సాధించవచ్చు.

 నిధుల బడ్జెట్ మాదిరిగా నీటి బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  కాలుష్యం, సహజ వనరుల విధ్వంసం, సహజ వనరుల క్షీణత వంటి అంశాల పట్ల తెలంగాణ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.  అన్ని ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది.  తెలంగాణలో ప్రకృతి వనరులు వేగంగా తగ్గిపోతున్న తరుణంలో  రీజనల్ రింగ్ రోడ్డు, ఇంకా ఇతర గుదిబండ ప్రాజెక్టులపై పునరాలోచించాలి. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిధుల కేటాయింపులు 2025–-26 బడ్జెట్లో కూడా లేవు. దిగజారుతున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితికి అనేక కారణాలు ఉన్నా అందులో ముఖ్యమైనవి.. అవినీతి, ఆశ్రితపక్షపాతం, పారదర్శక నిర్ణయాలు లేకపోవడం, సహజ వనరుల భక్షణ, కాలుష్యం. వీటిని ఎదుర్కొనే వ్యవస్థకు నిధులు ఇవ్వలేదు. గ్రామీణ ఉపాధి సంరక్షణకు నిధులు లేవు.

-- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-