- ‘పోలారిస్ డాన్’ మిషన్తో స్పేఎస్ఎక్స్ కంపెనీ ఘనత
న్యూయార్క్: బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేఎస్ఎక్స్ కంపెనీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ప్రైవేట్ మిషన్ లో ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపి, విజయవంతంగా స్పేస్ వాక్ నిర్వహించి చరిత్ర సృష్టించింది. దీంతో భవిష్యత్తులో లో ఎర్త్ ఆర్బిట్ కు ఆవల వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కమర్షియల్ స్పేస్ వాక్ లను సాకారం చేసే దిశగా స్పేఎస్ఎక్స్ సంస్థ చరిత్రాత్మకమైన ఈ ‘పోలారిస్ డాన్’ మిషన్ కు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో బిలియనీర్ జరేడ్ ఇజాక్ మాన్ నేతృత్వంలోని పైలట్ స్కాట్ కిడ్ పొటీట్, స్పేస్ఎక్స్ ఇంజనీర్లు సారా గిల్లీస్, అన్నా మెనోన్ బృందం అంతరిక్షానికి చేరుకుంది. గురువారం మూడో రోజున భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో జరేడ్ ఇజాక్ మాన్, సారా గిల్లీస్ చెరో 12 నిమిషాల చొప్పున స్పేస్ వాక్ చేశారు.
క్రూ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన స్కైవాకర్ హ్యాండ్ రైల్ సిస్టం సాయంతో స్పేస్ వాక్ లో పాల్గొన్నారు. వ్యోమనౌక నుంచి దూరంగా వెళ్లిపోకుండా ఉండేలా తమను తాళ్లతో కట్టి ఉంచుకుని.. కాళ్లు, చేతులు, శరీరాన్ని కదిలించి చూశారు. మిగతా ఇద్దరూ స్పేస్ క్రాఫ్ట్ లోనే ఉండి పర్యవేక్షించారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపితే.. అక్కడ ఎక్కువ సమయంపాటు ఉపయోగించేందుకు వీలుగా ఉండేలా తయారు చేసిన ఎక్స్ ట్రా వెహిక్యులార్ యాక్టివిటీ(ఈవీఏ) సూట్లను వీరు ధరించి ఈ సందర్భంగా టెస్ట్ చేశారు. పోలారిస్ కార్యక్రమంలో ఇది మొదటి మిషన్ కాగా, దీని తర్వాత మరో రెండు మిషన్లను చేపట్టనున్నట్టు స్పేఎస్ఎక్స్ కంపెనీ వెల్లడించింది.