పోలవరం ముంపు ప్రాంతాలను గుర్తించండి

పోలవరం ముంపు ప్రాంతాలను గుర్తించండి

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టుతో ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాల్సిందిగా ఏపీ సర్కారును పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశించింది. తెలంగాణ అధికారులతో చర్చించి ముంపు ప్రాంతాలను నిర్ధారించాలని సూచించింది. శుక్రవారం ఏపీ ఇరిగేషన్​ శాఖ స్పెషల్​ సీఎస్​కు పీపీఏ లేఖ రాసింది. గతంలో 2021 ఏప్రిల్​ 17 నుంచి 29 వరకు ముంపు ప్రాంతాల గుర్తింపుకు జాయింట్​ సర్వే చేశారు. ఆ సర్వే ఆధారంగా తెలంగాణ అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను వెంటనే గుర్తించాలని పీపీఏ ఆదేశించింది. 

మరోవైపు.. పోలవరం ప్రాజెక్టులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖను 2022 సెప్టెంబర్​లో సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో సెంట్రల్​ వాటర్ కమిషన్​(సీడబ్ల్యూసీ) చైర్మన్​ నేతృత్వంలో ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించారు. కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, దీంతో ఆ వరద సరిగ్గా ప్రవహించకుండా ముంపు పెరుగుతున్నదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటు ఎన్జీటీ కూడా ముంపు ప్రాంతాలను గుర్తించాలని గతంలో ఆదేశాలిచ్చింది.