AP News: నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ : పోలవరంలో నిపుణుల పరిశీలన

AP News: నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ : పోలవరంలో నిపుణుల పరిశీలన


 

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈసీఆర్‌ఎఫ్‌లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించిన నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.  జులై 2న ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణుల బృందం ఈసీఆర్​ఎఫ్​ గ్యాప్‌-2లో సేకరించిన మట్టి, రాతి నమునాలను పరిశీలించారు.

 అనంతరం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాప్‌లను చూశారు. నిపుణుల బృందానికి నమూనాల నాణ్యతను ఇంజినీర్లు వివరించారు. అంతర్జాతీయ నిపుణులు డివిడ్‌ బి.పాల్, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌ తదితరులు ఇవాళ, రేపు  ( జులై 2,3) పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు చేసిన పరిశీలనలో నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

డయాఫ్రంవాల్‌ పనితీరుపై జాతీయ జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికన స్థానిక ఇంజినీర్లు అంతర్జాతీయ నిపుణుల బృందానికి చూపారు. ఎలక్ట్రోడ్ల సాయంతో చేసిన పరిశోధనలు కాకుండా...అక్కడక్కడ తవ్వి మెటీరియల్ బయటకు తీసి పరీక్షించాలని అధికారులకు సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌(Cofferdam)లోనూ మరికొన్ని పరీక్షలు చేయించాల్సిందిగా నివేదించారు. బంకమట్టి ఉన్న చోట ఇంత భారీ నిర్మాణాలు చేసే విషయంలో  అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ప్రపంచంలో చాలాచోట్ల ఇలాంటి మట్టి ఉన్న ప్రాంతాల్లోనే ప్రాజెక్ట్‌లు నిర్మించారని తెలిపారు. మంగళ, బుధవారాల్లోనూ  ( జులై2,3) మరిన్ని పరీక్షలు చేయనున్న నిపుణుల బృందం...ఆ తర్వాత ప్రాజెక్ట్ స్థితిగతులపై ఉమ్మడిగా నివేదిక అందించనుంది.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడానికి దాదాపు నాలుగున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు అంచనా వేస్తుండగా... నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ప్రకారం ఆ సమయం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌లోని కీలక కట్టడాలు దెబ్బతినడంతో తిరిగి నిర్మించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం అంచనా వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇస్తామని  హామీ ఇచ్చిన డబ్బులు ఇచ్చేందుకే కేంద్రం సవాలక్ష కొర్రీలు వేస్తుండగా...ఇప్పుడు పెరిగిన వ్యయంపై ఏమంటుందో చూడాలి..