ఈ మధ్య కొంతమంది పోలీసులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కొందరు భూకబ్జా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇల్లీగల్ పనులు చేస్తూ పోలీస్ శాఖకే మచ్చ తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలకు సంబంధించి.. చాలామంది పై స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఆరోపణలు, విమర్శలు వచ్చి.. సస్పెండ్ కు గురయ్యారు. తాజాగా మరో పోలీసు అధికారిపై ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
పోలీస్ అకాడమీ ఎస్పీ నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదుతో ఐపీఎస్ నవీన్ కుమార్ ని అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ బేగంపేటలో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో కొంతకాలం నుంచి ఎస్పీ నవీన్ కుమార్ అద్దెకు ఉంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి.. తమ ఇళ్లును సొంతం చేసుకోవాలని ఎస్పీ నవీన్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు భన్వర్ లాల్. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి.. ఎస్పీ నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.