పోలీసులు బీఆర్ఎస్ నేతలకు ఏజెంట్లు​గా పనిచేశారు : ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు :  పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి పని చేయడం చూస్తే సిగ్గు పడాల్సి వస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తలదించుకునేలా ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్  ప్రవీణ్  కుమార్  విమర్శించారు. శుక్రవారం కాగజ్ నగర్ లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్  సందర్భంగా అధికార బీఆర్ఎస్  అభ్యర్థి కోనప్ప రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. కాగజ్‌నగర్‌ మండలంలోని కొత్త సార్సాలలో బీఎస్పీ ఏజెంట్ పై బీఆర్ఎస్  నేతలు  పోలీసుల సమక్షంలో దాడి చేసినా  పట్టుకోలేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చీఫ్  పోలింగ్ ఏజెంట్ అయిన అర్షద్  హుస్సేన్ ను బెజ్జూర్‌  సహా మిగతా చోట్ల తిరగకుండా పోలీసులు అడ్డుకోవడం ఏందని ఆయన ప్రశ్నించారు.

‘‘కాగజ్‌ నగర్‌లో పోలింగ్ బూత్ నంబర్- 90 లో రిగ్గింగ్  జరిగిందని బీఎస్పీ,- బీజేపీ నేతలు ఆందోళన చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. రిగ్గింగ్ కు పాల్పడిన వ్యక్తిని దొడ్డిదారిన పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపారు. అక్కడ ధర్నా చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోనేరు కోనప్ప సోదరుడు , జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణారావు, ఇతర నాయకులు వచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రెచ్చగొట్టారు. ఇదంతా తమ ముందే జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు” అని ఆర్ఎస్  విమర్శించారు. పోలీసులు వెంటనే  బీఆర్ఎస్  నేతలపై కేసులు నమోదు చేయాలని ప్రవీణ్​ కుమార్  డిమాండ్ చేశారు . చేతగాకపోతే గులాబీ కండువా వేసుకావాలని, లేదా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని ఆయన సూచించారు. ఓటమి భయంతో దాడులు చేస్తున్న బీఆర్ఎస్  నేతలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వనున్నారని, తమ పార్టీకి డబుల్ డిజిట్  సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.