గోదావరి సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్

  • మావోయిస్టు పార్టీ  ఆవిర్భావ వేడుకలు
  •     అటవీ గ్రామాలపై పోలీసుల డేగకన్ను​
  •     సరిహద్దు అడవుల్లో భారీ కూంబింగ్​
  •     మావోయిస్టు టార్గెట్లకు పోలీసుల నోటీసులు జారీ

జయశంకర్‌‌ భూపాలపల్లి, మహాముత్తారం, వెలుగు:  భారతీయ కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) ఆవిర్భవించి 19 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ పార్టీ వారోత్సవాలు నిర్వహిస్తోంది.  గురువారం నుంచి ఈ నెల 28 వరకు ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి రాష్ర్టంలో కమ్యూనిస్టు పార్టీలు చీలిపోగా..  కొందరు అజ్ఞత ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ఈ క్రమంలో ఏర్పడిన పీపుల్స్​ వార్​ పార్టీ, 2004 సెప్టెంబర్​ 21న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్​ ఆఫ్​ ఇండియాలో విలీనమైంది.  ఆ తరువాత మావోయిస్టు పార్టీగా  కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది. ప్రతీయేటా లాగే ఈ సారి కూడా ఆ పార్టీ వారోత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో మూడు రాష్ట్రాల పోలీసులు ఇటీవల సమావేశమయ్యారు. మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. 

నక్సల్స్ కదలికలపై నిఘా..!

మావోయిస్టు పార్టీ చత్తీస్​గఢ్​లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. సరిహద్దు తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు లేవని ప్రచారం సాగుతున్నప్పటికీ సివిల్​ ఆర్గనైజేషన్​ పేరిట చాపకింద నీరులా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  ఈ క్రమంలో భారతీయ కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) 19వ ఆవిర్భావ వారోత్సవాలను  ఘనంగా నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించడంతో భూపాలపల్లి, ములుగు జిల్లాలలో పోలీసులు అలర్ట్​ అయ్యారు. 

Also Read :దేవుడిని కూడా వదలరా : 11 కేజీల గణేష్ లడ్డూ కొట్టేసిన దొంగలు

ములుగు జిల్లాలో ఇటీవల మావోయిస్టుల పేరిట కరపత్రాలు కూడా వెళిశాయి. దీంతో పోలీస్‌‌ యంత్రాగం అలెర్ట్‌‌ అయ్యింది. వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు..!

చత్తీస్​గఢ్​, మహారాష్ర్ట సరిహద్దుల్లో పోలీసులు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. అడవులను అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల అడవుల్లో పోలీసులు భారీ కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. అటవీ గ్రామాలకు ఆనుకుని ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంపై పోలీసు నిఘా వర్గాలు డేగకన్ను వేశాయి.    

అటవీ గ్రామాల్లో మరీ ముఖ్యంగా గుత్తికోయగూడెం పై డేగకన్ను వేసి కార్డెన్​ సెర్చ్​లు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వెహికిల్‌‌ చెక్‌‌ చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు.  నక్సల్స్​ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా తీవ్రతరం చేశారు. నక్సల్స్​ తమ ఉనికిని చాటుకునేందుకు రాష్ర్ట సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కడైనా వార్షికోత్సవ సభలు నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమై చెట్టుపుట్ట గాలిస్తున్నారు.

టార్గెట్ల అప్రమత్తం..!

భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని వివిధ పార్టీల లీడర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, మావోయిస్టు లకు టార్గెట్ గా ఉన్న వ్యక్తులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు ​నోటీసులు జారీ చేశారు.  వారోత్సవాల సందర్భంగా ఈ నెల 28 వరకు టార్గెట్​లు సేఫ్ ఏరియాలోఉండాలని సూచించారు. లోకల్​ ఏరియాకు వస్తే పోలీసులకు ముందస్తు సమాచారం అందివ్వాలని తెలిపారు. మావోయిస్టు పార్టీ టార్గెట్​లు ఎవ్వరు కూడా అశ్రద్ద చేయొద్దని హెచ్చరించారు.