బీఆర్‍ఎస్‌‌ రజతోత్సవ సభలో పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టిన్రు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

బీఆర్‍ఎస్‌‌ రజతోత్సవ సభలో పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టిన్రు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది సుదర్శన్‌‌రెడ్డి
  • 2000 మంది పోలీసులకు డబ్బులు కడితే.. 200 మంది కూడా డ్యూటీకి రాలే
  • బస్సులు రాకుండా ఆర్టీవో బెదిరించిన్రు
  • ఎమ్మెల్సీ శ్రీనివాస్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

వరంగల్‍, వెలుగు: బీఆర్‍ఎస్‌‌ రజతోత్సవ సభలో పోలీసులు, ఆర్టీవో ఆఫీసర్లు కావాలనే ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌‌భాస్కర్‌‌, పెద్ది సుదర్శన్‌‌రెడ్డి ఆరోపించారు. 

హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్‍లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సభ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచే ఇబ్బంది పెట్టిందన్నారు. సభ డ్యూటీ కోసం రెండు వేల మంది పోలీసులకు తాము డబ్బులు కడితే.. కనీసం 200 మంది కూడా డ్యూటీ చేయలేదన్నారు. తాము సీసీ కెమెరాలు పెట్టి ఈ విషయాన్ని పరిశీలించామన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ వలంటీర్లే ట్రాఫిక్‌‌ను క్లియర్‌‌ చేశారన్నారు. పోలీసులు కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్‌‌ చేయలేదని ఆరోపించారు.

సభా వేదిక వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ మాత్రమే ఉన్నారన్నారు. సాధారణ రోజుల్లో డ్యూటీకి వెళ్లని ఆర్టీఏ ఆఫీసర్లు ఆదివారం మాత్రం తనిఖీల పేరుతో సభకు వచ్చే వాహనాల డ్రైవర్లను బెదిరించారన్నారు. 

బస్సులో ఉండే కార్యకర్తలను కావాలనే గంటల తరబడి ఎండలో నిల్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జనాలు బీఆర్‌‌ఎస్‌‌ సభను సక్సెస్‌‌ చేశారని చెప్పారు. సభా ప్రాంగణంలో కాల్వలు, పొలాల గట్లు, రోడ్లను తిరిగి సరి చేసే బాధ్యత తమదేనన్నారు. సమావేశంలో కే.వాసుదేవరెడ్డి, పులి రజనీకాంత్‌‌ పాల్గొన్నారు.