వనపర్తిలో లిక్కర్​ దందా .. జిల్లాలో ఎక్కడ చూసినా  బెల్ట్​ షాపులే

వనపర్తిలో లిక్కర్​ దందా .. జిల్లాలో ఎక్కడ చూసినా  బెల్ట్​ షాపులే
  • కిరాణా షాపుల్లోనూ యథేచ్ఛగా అమ్మకాలు
  • పోలీసు, ఎక్సైజ్​ ఆఫీసర్ల పర్యవేక్షణ కరవు

వనపర్తి, వెలుగు: జిల్లాలో  ఎక్కడ చూసినా బెల్ట్​ షాపులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ అమలులోకి రావడంతో పోలీసులు బెల్ట్​ షాపులపై ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేస్తున్నారు, కానీ గతంలో పట్టించుకున్న పాపాన పోలేదు.  జిల్లాలోని 14 మండలాల్లో కలిపి 37 వైన్స్​ ఉన్నాయి.  అందులో రిజర్వేషన్ల ప్రకారం జనరల్​కు 27, ఎస్సీలకు 5, ఎస్టీకి ఒకటి, గౌడ సామాజికవర్గానికి నాలుగు చొప్పున దుకాణాలు కేటాయించారు. అయితే ఈసారి రికార్డు స్థాయిలో 1,341 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలాఉంటే రూ.కోట్లు పెట్టి లిక్కర్​ షాపులు దక్కించుకున్న వ్యాపారులు గ్రామాల్లోనూ లిక్కర్​ అమ్మకాలు పెంచుకునేందుకు బెల్ట్​షాపులకు లిక్కర్​ సప్లై చేస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు లిక్కర్​ తీసుకెళ్లి, అక్కడ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. 

జిల్లాలో  400 పైగా బెల్ట్​షాపులు..

జిల్లాలో 255 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలున్నాయి.  లిక్కర్​ షాపులు గ్రామాలకు దూరంగా ఉండడంతో పల్లెల్లో  బెల్ట్​ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటే సరే కాని, మున్సిపాలిటీ పరిధిలోని శివారు కాలనీల్లోనూ బెల్ట్​ షాపులు నడుపుతున్నారు.  కొన్ని గ్రామాల్లో బెల్ట్​ షాపుల పోటీ ఎక్కువ కావడంతో  గ్రామ సంఘాలు వేలం పాటలు నిర్వహించగా, వేలంలో బెల్ట్​ షాపులు దక్కించుకున్నవారు ఇష్టారీతిన లిక్కర్​ అమ్ముతున్నారు.

ఇదిలాఉంటే అన్నిరకాల బ్రాండ్లు సైతం పల్లెల్లో దొరుకుతుండడంతో జనం బెల్ట్​షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఒక్కో  క్వార్టర్​ మీద రూ.10, బీర్​పై రూ.10లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. రాత్రి పూట అయితే రేటు పెంచేస్తున్నారు. ఎక్సైజ్​ ఆఫీసర్లు లిక్కర్​ సేల్స్​​ఎక్కువగా ఉండడంతో బెల్ట్​ షాపుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. లిక్కర్​ షాపుల ఓనర్లు తమకు గిరాకీ తక్కువైనప్పుడు, బెల్ట్​ షాప్​ వాళ్లు తమ వద్ద లిక్కర్​ తీసుకోవడం లేదని తెలిసినప్పుడు ఎక్సైజ్​ ఆఫీసర్లకు కంప్లైంట్​ చేసి దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

కిరాణాషాపుల్లోనూ అమ్మకాలు..

గ్రామాలు, పట్టణ శివారుల్లోని బెల్ట్​ షాపుల్లో లిక్కర్​ దొరుకుతోంది. జిల్లా కేంద్రంలోని 40కి పైగా కిరాణా షాపుల్లో లిక్కర్​ అమ్ముతున్నారు. పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ అమలులోకి రావడంతో పోలీసులు దాడులు చేయగా, కిరాణా షాపుల్లో పెద్ద ఎత్తున లిక్కర్​ దొరికింది.  గ్రామాల్లోని కిరాణా షాపుల్లోనూ కూల్​డ్రింక్స్​తో పాటు లిక్కర్​ అమ్ముతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు లిక్కర్​ కిరాణా షాపుల్లో దొరుకుతుండగా పోలీస్, ఎక్సైజ్​ ఆఫీసర్లు తనిఖీలు చేయడం లేదనే విమర్శలున్నాయి.  ఏదైనా సందర్భంలో కంప్లైంట్లు వస్తే నామ్​కే వాస్తేగా దాడులు చేసి ఊరుకుంటున్నారు.  

దాడులు చేస్తున్నాం..

బెల్ట్​ షాపులపై ఎప్పటికీ నిఘావేసి ఉంచుతున్నాం.  సమాచారం రాగానే దాడులు చేసి అక్రమంగా లిక్కర్  అమ్ముతున్న వారిపై కేసులు పెడుతున్నాం. ఎక్కడైనా బెల్ట్​షాపులు నడుస్తున్నట్లు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం.- వెంకట్​రెడ్డి, ఎక్సైజ్​ సీఐ, వనపర్తి