వరంగల్ జిల్లా కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసు విచారణలో పురోగతి లభించింది. డాక్టర్ సైఫ్‌ను తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా సైఫ్‌ను విచారిస్తున్న పోలీసులు అతడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డాక్టర్ ప్రీతికి సంబంధించిన ఫోన్ ఆధారంగా సైఫ్‌ను విచారిస్తున్నారు. డాక్టర్ ప్రీతి మొబైల్లో 27 స్క్రీన్ షార్ట్స్, మెసేజ్‌లు ఈ కేసులో కీలకంగా మారాయి. డాక్టర్ ప్రీతి నుంచి ఎల్ డీడీ, నాకౌట్ గ్రూపు నుంచి వచ్చిన మెసేజ్‌లు, అలాగే.. డాక్టర్ గాయత్రి, డాక్టర్ సంధ్య వద్ద నుంచి వచ్చిన మెసేజ్‌లతో కీలక సమచారం రాబట్టనున్నారు. డాక్టర్ వైశాలి, డాక్టర్ సంధ్య, డాక్టర్ స్పందన, నిందితుడు సైఫ్ నుంచి ప్రీతి మొబైల్ కి వచ్చిన చాట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొబైల్ టెక్నిషియన్ పెద్దోజు శివ చైతన్య సహాయంతో డాక్టర్ ప్రీతి చాటింగ్ ద్వారా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న ఎంజీఎం హెడ్ నర్స్ ఎల్లందుల సునీత, స్టాఫ్ నర్స్ చిన్నపల్లి కళా ప్రపూర్ణ నుంచి మరిన్ని వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
డాక్టర్ ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ విచారణలో కీలకంగా మారింది. బ్యాగ్‌లోని మొత్తం 24 ఆధారాలతో కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మాజా కూల్ డ్రింక్, లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ కేసులో అనుమానాస్పదంగా మారాయి. అలాగే.. ఎంజీఎం సెక్యూరిటీ గార్డులు రాజబోయిన సాంబరాజు, ఎర్రోజు కిశోర్ ల నుంచి విచారణ అధికారి వివరాలు సేకరించారు. డాక్టర్ సైఫ్ నుంచి సాంకేతిక ఆధారాలను పోల్చుతూ.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.