
- సివిల్ కేసులు, ల్యాండ్ సెటిల్‌మెంట్లలో జోక్యం చేసుకుంటున్న కొందరు ఆఫీసర్లు
- స్టేషన్ బెయిల్‌కు భారీ మొత్తంలో వసూళ్లు
- ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, వెలుగు : మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ గాడి తప్పింది. కొంతమంది పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలి జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. రాజకీయ నాయకులు, పైరవీకారులతో కుమ్మక్కై కేసుకో రేటు నిర్ణయించి వసూళ్లకు తెరలేపారు. కిందిస్థాయి ఆఫీసర్లు, సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడింది ఆట... పాడింది పాట అన్నట్లు తయారైంది. ముఖ్యంగా మంచిర్యాల డివిజన్‌లో ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ల్యాండ్ సెటిల్‌మెంట్లు, సివిల్ కేసుల డీలింగ్స్ జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న దాడులు
మంచిర్యాలలో కొంతకాలంగా గొడవలు, దాడులు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొందరు లీడర్లు కమ్ రియల్టర్లు గంజాయి గ్యాంగ్‌లను పెంచి పోషిస్తున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, దందాల కోసమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ గ్యాంగ్‌లను ఉసిగొల్పుతున్నారు. ఇలా ఏడాది వ్యవధిలో ఏడెనిమిది మందిపై దాడులు జరగడం కలకలం రేపింది. దాడులు చేసిన వారిపై నామమాత్రపు కేసులు పెడుతున్న పోలీసులు బాధితులపై అటెప్ట్ మర్డర్ కేసులు రిజిస్టర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించి ఇక మీదట దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో దాడులు కంట్రోల్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం కూడా వరుస దాడులు జరుగుతుండడంతో పోలీసులు వైఫల్యామా ? మరేదైనా కారణం ఉందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ల్యాండ్ సెటిల్‌మెంట్లు, సివిల్ కేసుల్లో జోక్యం
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో అదే స్థాయిలో వివాదాలు సైతం పెరుగుతున్నాయి. ఇదే అదునుగా కొంత మంది పోలీసులు సివిల్ కేసుల్లో తలదూర్చి ల్యాండ్ సెటిల్‌మెంట్లకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన ఓ అధికారి అయితే ఏకంగా... వివాదాస్పద భూములకు రేటు గట్టి అందులో 20 నుంచి 30 శాతం వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ల్యాండ్ కేసులు వస్తే ‘మీరు వెళ్లి సార్‌ను కలవండి’ అని స్థానిక ఆఫీసర్లు ఓ ఉన్నతాధికారి వద్దకు పంపుతున్నట్లు సమాచారం. సదరు అధికారి జిల్లాలో పోస్టింగ్ పొంది ఏడాది కూడా కాకుండానే గట్టిగానే వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వ్యవహారంపై ఓ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరో ఆఫీసర్ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఇద్దరూ ఒకే జిల్లాలో కలిసి పనిచేసిన అనుబంధాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
కేసుకో రేటు
జిల్లాలో కొందరు పోలీస్ ఆఫీసర్లు చిన్న చిన్న విషయాలకు కూడా కేసులు నమోదు చేయడం, ఇరువైపులా వసూలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కొన్ని చోట్ల అయితే కేసుకో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఎస్‌హెచ్‌వోకు ఇంత, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు, కిందిస్థాయి సిబ్బందికి ఇంత’ అంటూ లెక్కలు కట్టీ మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇలా కొందరు ఆఫీసర్లు వ్యవహరిస్తున్న తీరు పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారుతోంది. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రతి నెలా నిర్వహించే క్రైమ్రివ్యూల్లో కేసుల నమోదు, ఇన్వెస్టిగేషన్ విషయంలో పొరపాట్లకు తావు లేకుండా, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని సూచించడంతో పాటు అవినీతి, ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొందరు ఆఫీసర్లలో మార్పు రావడం లేదు.
అంతా లీడర్ల కనుసన్నల్లోనే...
రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకొని పోస్టింగ్ తెచ్చుకున్న పోలీసులు తర్వాత వాళ్లు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా పోలీస్ పోస్టింగ్‌ల్లో ఖద్దరు ముద్ర మాత్రం పోవడం లేదు. అధికారంలో ఎవరుంటే వారిని మచ్చిక చేసుకొని పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. మంచిర్యాలలో మంచి పోస్టింగ్ కోరుకుంటున్నవారు ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకోవడం కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయన ఆశీస్సులు ఉంటే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు వాడుకుంటూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. అయితే జిల్లా పోలీస్ శాఖలో జరుగుతున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాసులు కురిపిస్తున్న స్టేషన్ బెయిల్
గతంలో జిల్లాలో పనిచేసిన ఓ సీఐ నలుగురు ఆర్‌ఎంపీలపై నమోదు చేసిన కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆర్‌ఎంపీలు ఏసీబీ ఆఫీసర్ల దృష్టికి ఈసుకెళ్లడంతో విషయం తెలుసుకున్న సదరు సీఐ తృటిలో తప్పించుకున్నారు. సుమారు ఏడాది కిందట ఓ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన 498ఏ కేసులో రూ.2 లక్షలు తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో జిల్లా కేంద్రంలో పనిచేసిన ఓ సీఐ రూ.10 వేలు ఇస్తేనే కేసు నమోదు చేస్తానంటూ ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. చాలా కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం ఉండడంతో కేసును బట్టి రేటును ఫిక్స్ చేస్తున్నారు. చిన్నచిన్న కేసుల్లో సైతం అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే రోజుల తరబడి తిప్పుకోవడం పరిపాటిగా మారింది.