
రంగారెడ్డి జిల్లా శివారులోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్ మెంట్ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటికే షీ టీమ్.. యువతి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఆ సమయంలో యువతి షాక్లో ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయనున్నారు.
గొంతు పట్టుకున్నారు..
నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కోలుకుంటోంది. అటు ఈ ఘటనపై స్పందించిన బాధితురాలు..ఎంగేజ్ మెంట్ సమయంలో 10మంది ఇంట్లోకి ప్రవేశించి..తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించింది. తమ బంధువులు అడ్డగించినా..వారిని గాయపరిచి..తలుపులు ధ్వంసం చేశారని చెప్పింది. నవీన్ తన గొంతు పట్టుకుని లాక్కెళ్లాడని.. అడ్డుకోబోయిన తన తల్లిని తోసేసినట్లు తెలిపింది.
నవీన్ రెడ్డి కోసం గాలింపు
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక యువతి ఇంటిపై దాడి.. కిడ్నాప్‌లో మొత్తం 36 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిలో పోలీసులు 32 మందిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.