బంగారం తాకట్టు పెడితే పత్తాలేడు .. వ్యాపారి కోసం పోలీసుల గాలింపు

బంగారం తాకట్టు పెడితే పత్తాలేడు .. వ్యాపారి కోసం పోలీసుల గాలింపు

జీడిమెట్ల, వెలుగు: ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం, నగల తయారీ కోసం ఇచ్చిన డబ్బుతో ఓ వ్యాపారి ఉడాయించాడు. రాజస్థాన్​కు చెందిన  ఓం ప్రకాశ్​సిర్వీ 15 ఏండ్ల కింద వలస వచ్చి గాజులరామారం డివిజన్​చంద్రగిరినగర్​లో నివాసం ఉంటున్నాడు. తొలుత ‘రామ్​దేశ్’ పేరుతో స్థానికంగా జ్యువెలరీ పెట్టి, ఇటీవల దుకాణం పేరును ‘శ్రీశివం’గా మార్చాడు. చాలా కాలంగా దుకాణం ఉండడంతో అతని వద్ద కొందరు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. 

మరికొందరు ఆభరణాలు చేయించేందుకు డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 25 నుంచి దుకాణం మూసివేసి ఉండడం, అతని ఫోన్​పనిచేయకపోవడంతో బాధితులు జగద్గిరిగుట్ట పీఎస్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ.కోటి వరకూ  మోసపోయామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.