దారివెంట సోదాచేసే.. అధికారం పోలీసులకు ఉందా?

దారివెంట సోదాచేసే.. అధికారం పోలీసులకు ఉందా?

కారులో  వెళ్తున్న వ్యక్తులను ఆపి పోలీసులు సోదా చేస్తున్నారు. ఆ కారులో ఏమైనా డబ్బులు ఉంటే వాటిని పోలీసులు జప్తు చేస్తున్నారు. వివాహం ఉందని, నగలు కొనడానికి డబ్బు తీసుకువెళ్తున్నామని చెబుతున్నా పోలీసులు వినకుండా నగదును జప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు తమ బంధువుల కోసం డబ్బును పంపిస్తూ ఉంటారు. ఆ మనీని ట్రాన్స్​ఫర్​​ ఏజెంట్లు డబ్బులు తీసుకుని వెళ్లి అందించలేని పరిస్థితి ఏర్పడింది. బీడీ కార్మికులకు జీతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటన్నిటికి కారణం ఎన్నికలు. 

ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి పోలీసులు సోదా చేసి డబ్బులను జప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు చేస్తున్నది మంచిపనే అయినా దీనివల్ల కొంతమంది సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులకు ఈ విధంగా సోదా చేసే అధికారం ఉందా?.

సోదా అధికారం పోలీసులకు లేకపోతే..

ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు ఈ అధికారం లేకపోతే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది పరిశీలిద్దాం... సోదా చేసే అధికారం పోలీసులకు లేకపోతే అక్రమంగా డబ్బు రవాణాని నియంత్రించే అవకాశం ఉండదు. అదేవిధంగా ఉగ్రవాదులు పారిపోతున్నప్పుడు వాళ్లని పట్టుకునే అవకాశం ఉండదు. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను, ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడాన్ని ఆపే పరిస్థితి ఉండదు. రోజురోజుకీ ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద చర్యలు దేశంలో ప్రబలుతున్నప్పుడు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు పోలీసులు చేసే సోదాలకు అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతోఉంది.

అయితే ఈ విధంగా సోదా చేసే అధికారం పోలీసులకు ఉందా? లేకపోతే చట్టంలో తీసుకురావాల్సిన మార్పులేమిటి? ఈ విషయాలపై ఎవరూ ఆలోచిస్తున్నట్లు కనిపించడంలేదు. సోదాలు చేయడం గురించి, దర్యాప్తు గురించి వివరించే పద్ధతులు ఉన్న చట్టం ‘క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్’ . ప్రత్యేకమైన చట్టాల్లో ప్రత్యేకమైన దర్యాప్తు పద్ధతులు ఉంటాయి. వాటి విషయం పక్కనపెట్టి క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారం పోలీసులకు ఉన్న అధికారాలు ఏమిటి?

ఒక కారును సోదాచేసే అధికారం పోలీసులుకు చట్ట ప్రకారం ఉందా?. ‘పరిశీలించడం’, ‘సోదా’, ‘జప్తు’, అన్న ఈ మూడు పదబంధాల అర్థాలను ముందుగా పరిశీలించాలి. ‘పరిశీలించడం’ అంటే దగ్గరగా చూడటం లేదా అధికారికంగా పరిశీలించడం. ‘సోదా’ అంటే మామూలుగా చూడటం మాత్రమే కాదు ఏదైనా వస్తువును మరుగుపరిచినారా లేదా దాచి ఉంచారా అన్నది కనుక్కోవడం. ఇక ‘జప్తు’ అంటే ఏదైనా వస్తువును అధీనంలోకి తీసుకోవడం. 

సోదాలు రెండు రకాలు

ప్రధానంగా సోదాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి.. వ్యక్తుల కోసం వెతకడం, పత్రాల కోసం, వస్తువుల కోసం వెతకడం. అదేవిధంగా వ్యక్తుల కోసం వెతికే పద్ధతిని మరో రెండు రకాలుగా విభజించే అవకాశం ఉంది. అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సోదా (సె.47 క్రి.ప్రొ.కో.), అక్రమంగా నిర్బంధించిన వ్యక్తుల కోసం వెతకడం (సె97. క్రి.ప్రొ.కో.) అరెస్టయిన వ్యక్తులను సోదా చేయడం (సె.51క్రి.ప్రొ.కో.).  ఈ క్రమంలో పత్రాల కోసం, వస్తువుల కోసం జరిపే సోదాలను కూడా రెండు రకాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. వారంట్ ద్వారా సోదా జరపడం (సె.93, 94, 95, 100 క్రొ.ప్రొ.కో.), అత్యవసరమైన పరిస్థితుల్లో వారంట్ లేకుండా సోదా జరపడం (సె.165, 166, క్రి.ప్రొ.కో). సోదా జరపకుండా జప్తు కూడా చేసే అవకాశం ఉంది.

నేరం చేసే ఆయుధాలు ఉన్నప్పుడు వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. (సె.52 క్రి.ప్రొ.కో.), కొన్ని రకాలైన ఆస్తిని పోలీసులు జప్తు చేసే అధికారం (సె.102 క్రి.ప్రొ.కో.). తన సమక్షంలో సోదా చెయ్యమని మేజిస్ర్టేట్​ ఆదేశించే అధికారం (సె.103  క్రి.ప్రొ.కో.).  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​ సోదా గురించి, జప్తు గురించి ఉన్న నిబంధనలు ఇవే. ఈ నిబంధనల ప్రకారం పోలీసులు సోదాలను, జప్తులను చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం పోలీసులకు ఉన్న అధికారాలు, వాళ్ల అధికార పరిధి ఏమిటో పరిశీలించడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం. 

వారెంట్ లేకుండానే సోదాలు

వ్యక్తుల కోసం సోదాను రెండు నిబంధనల ప్రకారం జరపడానికి అవకాశం ఉంది. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె.47, 97 ప్రకారం ఈ సోదాలను జరపడానికి అవకాశం ఉంది. అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సె.47 ప్రకారం సోదా జరపవచ్చు. ఈ అధికారం పోలీసులకు ఉంది. ఇతర వ్యక్తులకూ ఉంది. ఈ సోదాను పోలీసులు వారంట్ అమలు చేయడం ద్వారా చేయవచ్చు. వారంట్​ లేకుండా కూడా సోదా జరపవచ్చు. ఇతర వ్యక్తులు మాత్రం వారంట్​ లేకుండా సోదా చేసే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో ఈ సోదాను చేస్తున్నారో, ఆ ప్రాంతం (ఇల్లు) ఎవరి అధీనంలో ఉందో ఆ వ్యక్తి పోలీసులకు సహకరించాలి.

అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. ఎరికోసమైతే సోదా చేస్తున్నారో ఆ వ్యక్తి పారిపోతాడని భావించినప్పుడు, ఆ ఇంటి యజమాని సహకరించనప్పుడు పోలీసులకు తలుపులు బద్దలు కొట్టే అధికారం ఉంటుంది. సోదా పూర్తి అయిన తరువాత ఎవరినైతే అరెస్టు చేయాల్సి వస్తుందో  వాళ్లను అరెస్టు చేయవచ్చు. అరెస్టయిన వ్యక్తిని సోదా చేసే అధికారం సె.51 ప్రకారం పోలీసులకు ఉంది. 

చట్టం నిర్దేశించిన పద్ధతుల్లోనే సోదాలు జరగాలి

సె.102 ప్రకారం సోదా చేయకుండా ఏదైనా ఆస్తిని జప్తు చేసే అధికారం ఉంది. అయితే దానికి రెండు షరతులు ఉన్నాయి. మొదటిది..ఆ ఆస్తి దొంగిలించబడిన ఆస్తి కావాలి. రెండవది..ఏదైనా నేరం జరిగిందన్న అనుమానం ఉన్న ఆస్తి అయినా కావాలి. ఈ షరతులు ఉన్నప్పుడే పోలీసులు ఏదైనా ఆస్తిని జప్తు చేసే అధికారం ఉంటుంది. అంటే ఇలాంటి ఆస్తిని ఎవరైనా వ్యక్తులు పట్టుకుని తిరుగుతున్నప్పుడే జప్తు చేయవచ్చు. అంతేకానీ, ఇలాంటి ఆస్తిని కారు నుంచి, వాహనాల నుంచి జప్తు చేసే అధికారాన్ని చట్టం పోలీసులకు ఇవ్వలేదు. ఈ విధంగా జప్తు చేసిన ఆస్తిని సంబంధిత జ్యుడీషియల్​ మేజిస్ర్టేట్​ దగ్గరకు పంపిస్తున్నారు.

నా దృష్టికి వచ్చిన సంఘటనలు ఈ విధంగానే ఉన్నాయి. సోదా అనేది మామూలు విషయం కాదు. వ్యక్తుల గోప్యత హక్కులలోకి జొరబడటమే. సమాజ శ్రేయస్సు రీత్యా సోదాలు అవసరమే. అయితే సోదాలు చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో జరగాలి. సమాజ శ్రేయస్సుకు తగినట్టుగా చట్టం లేకపోతే తగు మార్పులు చట్టంలో తీసుకుని రావాలి. ఈ పరిస్థితుల్లో సోదాలను ఆమోదించలేం. అట్లా అని వద్దని కూడా అనలేని  పరిస్థితి ఉంది.

ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే..

ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె.97 ప్రకారం వారంట్​ ద్వారా సోదా జరిపి వాళ్లను ఆ నిర్బంధం నుంచి విడిపించే అవకాశం ఉంది. ఈ వారంట్​ను జ్యుడీషియల్​ ఫస్ట్​ క్లాస్​ మేజిస్ట్రేట్ నుంచి పొందవచ్చు. అక్రమంగా నిర్బంధించిన వ్యక్తులను బయటకు తీసుకుని రావాలంటే వారంట్​ ఉండాలి. వస్తువుల కోసం, పత్రాల కోసం కూడా పోలీసులు సోదా జరపవచ్చు. వారంట్​ ద్వారా సోదా జరపాలి. అందుకు ఉన్న నిబంధనలు సె.93, 94, 95 క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె.100 ప్రకారం మూసివున్న ‘ప్రదేశాన్ని’ ఏవిధంగా సోదా చేయవచ్చో తెలుసుకోవచ్చు. ‘

ప్రదేశాన్ని’ సోదా చేసే పద్ధతిని సె.100 వివరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వారంట్​ లేకుండా కూడా సోదా జరపవచ్చు. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె.165, పోలీస్​ స్టేషన్​ ఇంచార్జి అధికారి లేదా  కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి తన పోలీసు స్టేషన్​ అధికార పరిధిలో సోదా ఎలా చేయాలో వివరిస్తున్నది. తన దర్యాప్తునకు అవసరమైన వస్తువులు ఏప్రదేశంలోనైనా ఉన్నాయని విశ్వసనీయంగా ఆ పోలీసు అధికారికి అన్పించినప్పుడు వారంట్​ తీసుకోవడం వల్ల జాప్యం జరుగుతుందని భావించినప్పుడు ఆ కారణాలను రాసి ఆ ‘ప్రదేశాన్ని’  సోదా చేయాల్సి ఉంటుంది. 

ఆ సోదా చేసే క్రమంలో సె.100  చెప్పిన పద్ధతులను పాటించాలి. తయారు చేసిన రికార్డుకు సంబంధించిన జ్యుడీషియల్​ మేజిస్ట్రేట్​కు పంపించాలి. తన అధికార పరిధి వెలుపల సోదా చేసినప్పుడు, ఆ సోదా విషయాన్ని సంబంధిత పోలీసు అధికారికి తెలియజేయాలి. అతడినే సోదా జరపమని కోరాలి. అత్యవసర పరిస్థితుల్లో నోటీసు ద్వారా సంబంధిత పోలీసు అధికారికి తెలియపరచి అధికార పరిధి వెలుపల సోదా చేయవచ్చు. .

దర్యాప్తులో భాగంగానే సోదా 

సోదా చేసే అధికారం పోలీసు అధికారికి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఉంటుంది. ‘ప్రదేశాన్ని’ సోదా చేయవచ్చు. ‘ప్రదేశం’ అంటే ఏమిటో క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని 2(సి)లో వివరించారు. ఆ నిర్వచనం ప్రకారం ప్రదేశం అంటే.. ఇల్లు, బిల్డింగ్, వాహనం, గుడారం, జలయానం చేసే ఓడల్లాంటివి. ‘కారు’ అనేది ప్రదేశం అన్న మాట. కారుని కూడా సోదా చేయవచ్చు. అయితే ఏదైనా కేసులో దర్యాప్తులో భాగంగా మాత్రమే సోదా చేయడానికి అవకాశం ఉంది. ఎలాంటి కేసు దర్యాప్తులో లేకుండా కారుని సోదా జరపడానికి అవకాశం లేదు. ‘ప్రదేశాన్ని’ (కారుని కూడా) సోదా చేయాలంటే ఇద్దరు గౌరవప్రదమైన సాక్షుల సమక్షంలోనే సె.100 ప్రకారం సోదా జరపాల్సి ఉంటుంది. మిగతావిధంగా చేస్తున్న సోదాలు చట్టబద్ధమైనవి కావు. 

- మంగారి రాజేందర్,  జిల్లా జడ్జి  (రిటైర్డ్​)