జనగామ అర్బన్, వెలుగు: ఓ బాక్స్‌లో ఎలక్ట్రానిక్డివైస్ అమర్చి అయస్కాంతం పెడితే వైబ్రేషన్స్వచ్చేలా చేసి మహిమ గల పెట్టె అంటూ అమాయకులను బురిడీ కొట్టించిందో ముఠా. ఇప్పటికే ఆరుగురి దగ్గర అడ్వాన్స్ తీసుకుని తప్పించుక తిరుగుతున్నారు. మరో బాక్స్అమ్మేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్వస్తుండగా సోమవారం జనగామ మండలం పెంబర్తి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డి కథనం ప్రకారం..నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మున్ననూరుకు చెందిన కేతావత్ శంకర్, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి చెందిన ఖాసీం, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహ్మద్ అజార్, నల్లగొండ జిల్లా దిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన కొర్ర సాసీరాం ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు.
ఒక పెట్టెను కొని దానికి ఎలక్ట్రానిక్ డివైస్అమర్చారు. పెట్టెపై అయస్కాంతం పెడితే వైబ్రేషన్వచ్చేట్టు చేశారు. పిడుగు పడ్డప్పుడు వచ్చే మెటల్‌తో తయారు చేశామని, మహిమలు ఉన్నాయని..ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని పలువురిని నమ్మించారు. ధర రూ.50 కోట్లు ఉంటుందని చెప్పి రూ.5 నుంచి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకునేవారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు అడ్వాన్స్తీసుకుని ఉడాయించేవారు. ఇలా ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారు. సోమవారం వరంగల్‌లో ఓ వ్యక్తి బాక్స్ కొనేందుకు ఆసక్తి చూపడంతో ఆటోలో పెట్టెను పట్టుకుని వెళ్తుండగా జనగామ పోలీసులకు చిక్కారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జనగామ ఎస్సై సృజన్,కానిస్టేబుళ్లు కరుణాకర్, రామన్న, అనిల్, సాగర్లను ఏసీపీ అభినందించారు. సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.