
- రూ. 20 లక్షల నగదు, 6 మొబైళ్లు, ఒక బొలెరో వాహనం సీజ్
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని జీఎంఆర్ ఎరీనా ఏరియాలో కాపర్ వైర్లను దొంగల ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఆఫీస్‌లో గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన ఆదిల శ్రీకాంత్ జీఎంఆర్ ఎరీనా కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు.
ఇదే ప్రాంతానికి చెందిన ఖాదర్ ఖాన్, మహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఖుర్షీద్, వహేద్ అలీ, ఉప్పుగూడకు చెందిన కేతవత్ బాషా, బోలక్ పూర్ సిద్దిక్ నగర్ కాలనీకి చెందిన అబ్దుల్ వాహెద్ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతేడాది నవంబర్ 17 నుంచి 27 మధ్య జీఎంఆర్ ఎరీనా కంపెనీలో దాదాపు రూ.20 లక్షల విలువైన కాపర్ వైర్లను దొంగిలించారు. ఈ ఘటనపై కంపెనీలో అంతర్గత దర్యాప్తు చేపట్టిన అనంతరం ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ను పోలీసులకు ఈనెల 11న అప్పగించారు.
దీంతో అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురు నిందితులు కేతవత్ బాషా, అబ్దుల్ వాహెద్, ఖాదర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. దొంగిలించిన కాపర్ వైర్లను నిందితులు కట్ చేసి అమ్మడం వల్ల రికవరీ సాధ్యం కాలేదని, కేబుల్ విక్రయించి సంపాదించిన రూ.20 లక్షల డబ్బును రికవరీ చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 6 మొబైల్ఫోన్లు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలోఉన్న మహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఖుర్షీద్, వహేద్ అలీ కోసం గాలిస్తున్నామన్నారు.