నిర్మాణంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్ .. 7 నెలలుగా నిద్ర లేకుండా చేసిండ్రు

నిర్మాణంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్ .. 7 నెలలుగా నిద్ర లేకుండా చేసిండ్రు
  • సెంట్రింగ్ డబ్బాల దొంగల ముఠా అరెస్ట్ 
  • 43 టన్నుల స్లాబ్​బాక్స్ లు స్వాధీనం
  • 8 మందికి రిమాండ్, పరారీలో మరో 10 మంది

చేవెళ్ల, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఇళ్లే వారి టార్గెట్. ఉదయం రెక్కీ నిర్వహిస్తారు. రాత్రికి పని ఫినిష్ చేస్తారు. ఇలా గడిచిన ఏడు నెలలుగా స్లాబ్ సెంట్రింగ్​డబ్బాలను దొంగిలిస్తూ సెంట్రింగ్ యాజమానులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గ్యాంగ్​లోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ సోమవారం వెల్లడించారు. హైదరాబాద్​లోని గుల్షన్ నగర్​కు చెందిన మోసిన్ అహ్మద్ (23) స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు. ఈజీమనీ కోసం యూపీకి చెందిన 17 మందిని రోజువారీ కూలీలుగా నియమించుకున్నాడు. 

కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్​ల వద్ద వీరితో ఉదయం రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఆపై అర్ధరాత్రి టాటాఏసీ వాహనం తీసుకొని వచ్చి సెంట్రింగ్ డబ్బాలను ఎత్తుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్​పల్లి, మోకిల, మొయినాబాద్, నార్సింగి పీఎస్​ల పరిధిలో దాదాపు 4,566 స్లాబ్​ బాక్స్​లు దొంగిలించారు. వీరిపై చేవెళ్లలో 6, మొయినాబాద్​లో 3, శంకర్ పల్లి, మోకిల, నార్సింగిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చేవెళ్ల పోలీసులు సీరియస్​గా తీసుకొని గట్టి నిఘా పెట్టారు. 

ఈ నెల 10న చేవెళ్లలో ఓ బిల్డింగ్​వద్దకు చోరీకి వచ్చిన ప్రధాన నిధితుడు మోసిన్ అహ్మద్ తో పాటుగా మహ్మద్ రహమాన్, అర్బాజ్, అయాజ్, గుసావ్ అలీ, కలీమ్ ఉద్దీన్, అన్సార్ అలీ, మహమ్మద్ సకిల్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 43 టన్నుల 3,732 సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో మరో 10 మంది అల్తాప్ హుస్సేన్, ఇమ్రాన్, అఖిల్ బాజ్‌పేయీ, బజేలా అలీ, అజీద్ అలీ, అర్వాజ్, రిజ్వాన్,  బాసిమ్ ఖాన్, నన్నే, ఖలీద్ పరారీలో ఉన్నట్లు  తెలిపారు.  వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.