భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

శంషాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్న స్థావరాలపై దాడులు చేపట్టారు. నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠాపై కన్నేసిన పోలీసులు.. పక్కా ప్లాన్ వేసి నేరస్తులను పట్టుకున్నారు. మే 13వ తేదీ శనివారం సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొండపల్లి వద్ద ఓ హోటల్ పై దాడి చేసి భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు.

విశ్వనీయ సమాచారంతో హోటల్ పై దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి దాదాపు రూ.20 లక్షల నకిలీ కరెన్సీతో పాటు నోట్ల తయారీ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నకిలీ కరెన్సీ ఎలా సరఫరా చేస్తున్నారు? తయారు చేసిన తర్వాత ఎక్కడెక్కడకు సరఫరా చేస్తున్నారు? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.