ఫేక్ ఆఫర్ లెటర్స్​తో మోసం .. రూ.25 లక్షలు కొట్టేసిన నలుగురు అరెస్ట్

ఫేక్ ఆఫర్ లెటర్స్​తో మోసం .. రూ.25 లక్షలు కొట్టేసిన నలుగురు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని13 మంది నుంచి రూ.26.25 లక్షలు కొట్టేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన గడ్డపోల్ల పవన్ కుమార్ (34), సఫిల్ గూడకు చెందిన బోగా రేవంత్(39), అంబర్ పేటకు చెందిన సకినాల సుధీర్(39), ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన బాపట్ల రాజీవ్ రెడ్డి (32) ముఠా సభ్యులు. బ్యాక్ డోర్ జాబ్స్ కోసం ప్రయత్నించే అభ్యర్థుల సమాచారాన్ని సేకరించి ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. నిందితుల్లో ఒకరైన సకినాల సుధీర్ కు గతంలో జాబ్ కన్సల్టెన్సీలో పనిచేసిన అనుభవం ఉండగా, జాబ్ కోసం వచ్చిన వారి రెజ్యూమేలు సేకరించి పవన్ కు పంపించేవాడు. 

ఈ డేటా ఆధారంగా ఐటీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ గా యాక్ట్ చేస్తూ రేవంత్ అభ్యర్థులకు కాల్ చేసేవాడు. ఇంటర్వ్యూను కూడా ఫోన్ లోనే చేసి సెలెక్ట్​చేసేవాడు. ఆ తర్వాత రాజీవ్ రెడ్డి https://emkei.cz పేరుతో ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసి, నకిలీ ఐడీలు, ఆఫర్ లెటర్లను అభ్యర్థులకు మెయిల్​చేస్తున్నాడు. దీంతో ఆ ఆఫర్ లెటర్లు నిజమేనని నమ్మిన దాదాపు 13 మంది బాధితులు ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు పవన్ కుమార్​కు సమర్పించుకున్నారు. 

ఇందులో రాజీవ్ రెడ్డి, రేవంత్, సుధీర్ కు ఒక్కో అభ్యర్థికి రూ.10 వేల చొప్పున పవన్​ఇచ్చాడు. వీరి చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆఫర్​లెటర్లు వచ్చిన మెయిల్​ఆధారంగా హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ టీమ్​, టాస్క్ ఫోర్స్, మారేడ్ పల్లి పోలీసులు కలిసి నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.5.67 లక్షల నగదు, ఫేక్ జాబ్ లెటర్స్, ఐదు సెల్​ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.