వైటీపీఎస్ లో రూ. 1.82 కోట్ల  అల్యూమినియం రోల్స్ చోరీ

వైటీపీఎస్ లో రూ. 1.82 కోట్ల  అల్యూమినియం రోల్స్ చోరీ

మిర్యాలగూడ, వెలుగు : దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ధ నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి అల్యూమినియం రోల్స్ చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.  డీఎస్పీ రాజశేఖర రాజు బుధవారం మీడియాతో మాట్లాడారు.   వైటీపీఎస్ లో ఇటీవల జరిగిన కాపర్ చోరీ కేసు  దర్యాప్తులో భాగంగా క్రే​సూపర్​ వైజర్లుగా పని చేస్తున్న యూపీకి చెందిన రంజిత్, అభయ్ ప్రతాప్ మౌర్యను  విచారించారు. ఈ విచారణలో అల్యూమినియం రోల్స్ ల చోరీ వెలుగు లోకి వచ్చింది.

 మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్పీ క్యాంప్ వాసి షేక్ మునీర్, షేక్ మహీమూద్, దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన  కంబాల అశోక్, గోపిశెట్టి అజయ్, పసుపులేటి కోటేశ్వరరావు ముఠాగా ఏర్పడ్డారు.   వీరంతా వైటీ పీఎస్ నిర్మాణ పనులను చేపట్టిన  బీహెచ్ఈఎల్  కంపనీ స్టోర్ యార్డ్ వద్దకు రాత్రి వేళల్లో  చేరుకొని సెక్యూరిటీ గార్డు, క్రేన్​ సూపర్​ వైజర్ల సహకారంతో  అల్యూమినియం రోల్స్  చోరీ చేశారు. వాటిని  హైదరాబాద్ లో   పాత ఇనుప సామన్ల వ్యాపారాలు చేస్తున్న  మహమ్మద్ షర్ఫుద్దీన్, మహమ్మద్ కైరుద్దీన్, షేక్ ముజీబ్, మహమ్మద్ వహీద్ అలీకి అమ్మారు.  

రెండేళ్లుగా ఈ చోరీలు సాగుతున్నట్లు విచారణలో గుర్తించామన్నారు.  అల్యూమినియం రోల్స్ చోరీ అయినట్లు  బీహెచ్ఈఎల్ కు  చెందిన సబ్ కాంట్రాక్ట్ కంపెనీ దుర్గా క్రేన్ సర్వీసెస్ సంస్థ నుంచి  అందిన ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేశామని,   సుమారు రూ. 1.82 కోట్ల విలువైన 28 అల్యూమినియం రోల్స్ చోరీ అయినట్లు డీఎస్పీ తెలిపారు.  ఈ కేసులో మునీర్, అశోక్, గోపిశెట్టి అజయ్,  కోటేశ్వరరావు, సెక్యూరిటీ గార్డ్ పుల్లయ్యని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.  

వీరి నుంచి రూ. 15.30 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పరారీలో ఉన్న మిగిలిన వారిని పట్టుకుని ప్రాపర్టీ రికవరీ చేసేందుకు దర్యాప్తు వేగవంతం  చేశామన్నారు.  కేసును చేధించిన మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, సీసీ ఎస్ సీఐ జితేందర్ రెడ్డి, సీసీ ఎస్ ఏఎస్ఐ అఫ్జల్ అలీ, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, ఇమ్రాన్, వహీద్, లింగారెడ్డిని డీఎస్పీ అభినందించారు.