డబ్బు.. డబ్బు.. డబ్బు.. కష్టపడి సంపాదించటం మానేసి.. అడ్డదారిలో కోట్లకు కోట్లు సంపాదించాలనే ప్లాన్ వేశాడు.. ఈ ప్లాన్ వేసింది కూడా ఓ మెడికల్ స్టూడెంట్.. బాగా చదివి డాక్టర్ సీటు తెచ్చుకున్నాడు.. కాలేజీలో జాయిన్ అయ్యాడు.. అక్కడే కథ అడ్డం తిరిగింది. చెడు అలవాట్లకు బానిస అయ్యాడు.. డాక్టర్ విద్యను మధ్యలోనే మానేశాడు.. డబ్బు కోసం క్లీనిక్ పెట్టాడు.. అది కూడా ఎత్తేశాడు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మనోడికి ఉన్న అలవాట్లకు అది కూడా దివాళా తీసింది.. దీంతో డాక్టర్ కావాల్సిన వాడు.. క్రిమినల్ అయ్యాడు.. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశాడు.. హైదరాబాద్ సిటీలోనే సంచలనంగా మారిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కొరివి ధనరాజ్.. అలియాస్ అర్జున్. డాక్టర్ విద్యను మధ్యలోనే వదిలేసి.. క్రిమినల్ గా మారాడు. ఈజీ మనీ కోసం.. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశాడు. హైదరాబాద్ సిటీ శివార్లలో మంచి ప్లాట్లు.. అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ ఓ అమ్మాయితో నారాయణ అనే వ్యాపారికి ఫోన్ చేయించారు. అతను నిజమే అనుకుని.. 2024, నవంబర్ 21వ తేదీన ఆదిబట్లకు పిలిపించారు. వాళ్లు చెప్పిన స్పాట్ కు వెళ్లిన వ్యాపారి నారాయణను.. ఎస్సై దుస్తుల్లో ఉన్న క్రిమినల్ డాక్టర్ అర్జున్ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.
ALSO READ | కూకట్ పల్లిలో భారీ చోరీ.. 80 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
వ్యాపారి నారాయణను కారులో ఎక్కించుకున్న అర్జున్ గ్యాంగ్.. సిటీలో తిప్పుతూ బెదిరించారు. 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని చెప్పటంతో.. కోటి రూపాయలకు దిగారు.. అంత కూడా లేదు అనటంతో 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇప్పటికి ఇప్పుడు ఆ 20 లక్షల డబ్బు ఇవ్వలేను అని చెప్పటంతో.. నాలుగు బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. పోలీసులకు చెబితే అమ్మాయిలతో ఉన్న నీ ఫొటోలు బయటపెడతానని.. మీ బంధువులకు చెబుతానని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.
ఈ ఘటనతో షాక్ అయిన వ్యాపారి నారాయణ.. నవంబర్ 23వ తేదీన ఆదిబట్ల పోలీసులకు కంప్లయింట్ చేశాడు. విచారణ చేసిన పోలీసులు.. మాస్టర్ మైండ్ కొరివి ధనరాజ్ అలియాస్ అర్జున్ ను అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరూ పోలీసులుగా నటించటానికి కావాల్సిన పోలీస్ డ్రస్సులను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. ఓ డమ్మీ తుపాకీని కూడా కొనుగోలు చేశారు. పోలీస్ విచారణలో.. పోలీస్ దుస్తులు, డమ్మీ తుపాకీ, ఓ కత్తి, బాండు పేపర్లు, షూస్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.
కిడ్నాప్, బెదిరింపుల సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈజీ మనీ కోసం.. జల్సాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. మొత్తానికి సిటీలో క్రిమినల్ డాక్టర్ కిడ్నాప్ కథ సంచలనంగా మారింది.