
సంగారెడ్డి టౌన్, వెలుగు: కొన్నేళ్లుగా ఫార్మా కంపెనీల్లో పల్లాడియం కార్బన్ చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు సీసీఎస్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రూపేశ్ వివరాలను వెల్లడించారు.
ఈ నెల 8న సదాశివపేట పీఎస్పరిధిలోని యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ 3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనం గురించి ఆ కంపెనీ హెచ్ ఆర్ మజ్జి సూరప్పల నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 19న మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి 96 కిలోల పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నారు.
అల్లం సాంబశివుడు, ప్రసాద్ సాహిల్ షిటోలే, ఆదిత్య అంకుశ్, తుమ్మ ముక్కంటి రెడ్డి, మట్ట కుటుంబరావు, గుమ్మడి శ్రీనివాసరావుతో పాటు పరారీలో ఉన్న మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గతంలో సాంబశివుడు పూణేలోని ఫార్మా కంపెనీలో పని చేసే సమయంలో ప్రసాద్, అన్మోల్ జగ్గే అలియాస్ రాజుతో పరిచయం ఏర్పడింది.
20 రోజుల కింద సాంబశివుడు ఆరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ కంపెనీ స్టోర్ మేనేజర్ ముక్కంటి రెడ్డిని కలిసి అతడికి డబ్బుల ఆశ చూపి మెటీరియల్ వివరాలను తెలుసుకొని ప్రసాద్‌కు చేరవేశాడు. 8న ప్రసాద్ అతడి గ్యాంగ్ సభ్యులు, ఏ2, ఏ 8 కంపెనీ నుంచి 120 కిలోల పల్లాడియం కార్బన్ దొంగిలించారు. దీని విలువ సుమారు 4. 5 కోట్లు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.