- ఐదు నెలల్లో డబ్బులు డబుల్ చేస్తానంటూ మోసం
- ఇన్వెస్ట్ చేసిన సుమారు 500 మంది బాధితులు
- ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి
- నిందితుడిని కర్నాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు: గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రూ.150 కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన రాజేశ్ హైదరాబాద్ హబ్సిగూడలో ప్రహణేశ్వరి ట్రేడింగ్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో పెట్టుబడులు పెడితే ఐదు నెలల్లో రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు. సుమారు ఐదు వందల మంది ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టారు. తొలుత ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఐదు నెలల తర్వాత తీసుకునేందుకు ముందుగానే చెక్కులు ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన మొత్తంపై రెండు శాతం లాభాన్ని వారానికి ఓ సారి తీసుకోవచ్చని నమ్మబలికాడు. రెండు నెలల పాటు లాభాలను సక్రమంగానే చెల్లించాడు.
దీంతో మరికొంత మంది అతడి వద్ద పెట్టుబడి పెట్టారు. అయితే కొన్నాళ్లుగా చెల్లింపులు ఆగిపోవడం, రాజేశ్ కన్పించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధుతులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని వాపోయారు. గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేశ్‌ను పోలీసులు కర్నాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకుని ఆదివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో బాధితులు బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీస్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇండ్లు, బంగారం తాకట్టు పెట్టి ఇన్వెస్ట్ చేశామని, అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కట్టిన డబ్బులను ఇప్పించాలని కోరారు.