
- మైనర్ బాలిక, మహిళతో పాటు నలుగురు యువకులు అరెస్ట్
- 1.8 కిలోల గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు స్వాధీనం
హనుమకొండ/వరంగల్, వెలుగు: బాలికలను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దించే ప్రయత్నం చేసిన ముఠాను వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ బాలిక కాగా, మరో మహిళ, నలుగురు యువకులు ఉన్నారు. వారి నుంచి 1.8 కిలో ల గంజాయి, 4,300 కండోమ్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు, ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో వెల్లడించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కు లత(38) కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతోంది. అమాయకంగా కనిపించే అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపేది. ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో తల్లిదండ్రులు చనిపోయిన ఓ మైనర్ బాలిక (16) ను ట్రాప్ చేసింది.
ఆ బాలికకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. ఆమెకు మాయమాటలు చెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపింది. వ్యభిచారం చేస్తే డబ్బులు ఇప్పిస్తానని, ఆ బాలిక ద్వారా ఆమె ఫ్రెండ్స్ ను కూడా అదే వృత్తిలోకి దించేందుకు ప్రయత్నం చేసింది. తన ప్లాన్ లో భాగంగా ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అదికాస్త బెడిసికొట్టింది.
మైనర్ పై అత్యాచారం చేసిన నిందితులు
తమ ప్లాన్ లో భాగంగా ముస్కు లత మొదట ఓ మైనర్ బాలికతో కలిసి మిల్స్ కాలనీలో ఇంకో మైనర్ బాలికకు ఎర వేసింది. మొదటి బాలిక ఇన్స్టాగ్రాంద్వారా రెండో బాధిత బాలికతో పరిచయం పెంచుకున్నది. ఆమె స్కూల్ కు వెళ్లే సమయంలో కలిసేది. అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్, వరంగల్ శంభునిపేటకు చెందిన అబ్దుల్ ఆఫ్నాన్(20) తో కలిసి బాలికను తీసుకెళ్లి మద్యం, గంజాయి మత్తు అలవాటు చేసింది.
కాగా.. మొదటి మైనర్ బాలిక, ఆమె బాయ్ఫ్రెండ్ అబ్దుల్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. రెండో బాలికను కూడా తమతో రమ్మని పిలిచారు. అనంతరం అబ్దుల్ తన ఫ్రెండ్స్ సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్కు విషయం చెప్పి అందరూ కలిసి ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు.
శంభునిపేటకు చెందిన ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్ నుంచి కొంత గంజాయిని తీసుకున్నారు. సైలానీ బాబా బంధువుకు నర్సంపేట సమీపంలో ఓ ఇల్లు ఉండగా.. అందరూ కలిసి ఈనెల 11న రెండో మైనర్ బాలికను తీసుకుని అక్కడికి వెళ్లారు. ఆమెపై సైలానీ బాబా, అబ్దుల్ ఆఫ్నాన్, మహ్మద్ అల్తాఫ్ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఈనెల 12న ములుగు క్రాస్ రోడ్డు వద్ద వదిలి పారిపోయారు.
నిందితులపై నేర చరిత్ర
బాలికను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేసిన ముఠాలో నలుగురికీ నేర చరిత్ర ఉంది. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న సైలానీ బాబాపై అటెంప్ట్ మర్డర్, రెండు దోపిడీ, ఒక దాడులకు సంబంధించిన కేసు ఉండగా.. ఆఫ్నాన్ పై కాళేశ్వరంలో మర్డర్ కేసు ఉంది. అల్తాఫ్పైనా కాళేశ్వరంలో ఒక మర్డర్ కేసు ఉండగా.. వదూద్ పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు ఉన్నాయి.
మిస్సింగ్ కేసుతో వెలుగులోకి..
ఈనెల 11న బాధితురాలు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాలతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి, నిందితులను గుర్తించారు. వారంతా వరంగల్ లో ఉన్నారన్న సమాచారంతో మైనర్ బాలికతో పాటు వ్యభిచారం గృహం నడిపే ముస్కు లత, అబ్దుల్ ఆఫ్నాన్, అతని స్నేహితులు సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్, ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్ ను మంగళవారం అరెస్టు చేశారు. వారిని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.