హనుమకొండ సిటీ, వెలుగు: ఉన్నత చదువులు చదివి జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం సీసీఎస్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.11.5లక్షల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ(క్రైం) మురళీధర్ వివరాలు వెల్లడించారు..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపూర్ కు చెందిన ఎర్రబోతుల సునీల్ (24) కేయూలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాడు. ఆన్లైన్ క్రికెట్, బెట్టింగులు, జల్సాలతో డబ్బులు పోగొట్టుకున్నాడు. సులభంగా డబ్బును సంపాదించాలనుకుని హనుమకొండ, మట్టెవాడ, ధర్మసాగర్ తో పాటు ఆలేరులో 15కు పైగా చోరీలు చేశాడు. 2022లో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించి పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అయినా మళ్లీ దొంగతనాలు స్టార్ట్ చేశారు. కేయూసీ జంక్షన్ లో తిరుగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.