
- ముగ్గురిని అరెస్ట్ చేసిన మందమర్రి పోలీసులు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.9.12 లక్షల విలువైన 365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మందమర్రి పోలీస్‌స్టేషన్ లో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన అబ్దుల్‌రజాక్ కొద్ది రోజులుగా గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు అమ్ముతున్నాడు.
రజాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తిరుపతి, బొలిశెట్టి జనార్ధన్‌కు నకిలీ విత్తనాలు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. కాసీపేట మండలం దేవాపూర్ చింతగూడ గ్రామ శివారులోని సల్పలవాగు పరిపరాల్లో దాచిపెట్టిన 315 కిలోల నకిలీ విత్తనాలను, అందుకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపించినట్లు ఏసీపీ తెలిపారు. నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని సూచించారు.