సర్కారు భూమి కబ్జా కేసు..నిర్మాత శివరామకృష్ణ, మరో ఇద్దరు అరెస్ట్

సర్కారు భూమి కబ్జా కేసు..నిర్మాత శివరామకృష్ణ, మరో ఇద్దరు అరెస్ట్
  • నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 84 ఎకరాలు కబ్జా
  • అది సర్కారు భూమేనని తేల్చిన సుప్రీంకోర్టు 

ఓయూ, వెలుగు : నకిలీ డాక్యుమెంట్లతో కోట్లాది రూపాయల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్రయత్నించిన కేసులో టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ, మరో ఇద్దరిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. ఓయూ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్లాన్ వేసిన శివరామకృష్ణ తార్నాక స్టేట్ ఆర్కీవ్స్ లోని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు.

ఈ నకిలీ ప్రతాల సహాయంతో బిల్డర్ మారగొని లింగం గౌడ్ సహాయంతో ఆ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాడు. కబ్జాకు గురైన స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి శివరామకృష్ణ కబ్జా చేసినట్లు గుర్తించిన ప్రభుత్వం 2003లో కోర్టులో కేసు వేసింది. హైకోర్టులో శివరామకృష్ణకు అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు ఇరువైపులా వాదనలు విన్న తరువాత శివరామకృష్ణ ఆర్కియాలజీ విభాగ ఉద్యోగి సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసినట్టు నిర్ధారించింది.

ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని, శివరామకృష్ణ ప్రభుత్వ భూమిలోకి ట్రెస్​పాస్​అయ్యాడని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఈ నెల 19న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగంగౌడ్ లపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 420, ఫోర్జరీ ఆరోపణలతో కేసు నమోదు చేసి, నిందితులను ఇటీవల అరెస్ట్ చేశారు.