
- ఇద్దరు అరెస్ట్, పరారీలో కీలక నిందితుడు
గద్వాల, వెలుగు: అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండా ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మొగులయ్య వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం తండాకు చెందిన నగేశ్, లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన నాగరాజు ఫేక్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికెట్లు పెట్టి ఏఈవో గ్రేడ్-–2 పోస్టులకు సెలెక్ట్ అయ్యారు.
యూపీలోని ఘాజీపూర్ కాలేజీలో చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించగా, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలో సదరు కాలేజీలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు లేదని తేలింది. దీనిపై గత ఏడాది మార్చి15న ఏడీఏ సంగీతలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన నరేశ్, నాగరాజును అరెస్ట్ చేశామని, కీలక సూత్రధారి అయిన కాలేజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు.
మిర్యాలగూడ కేంద్రంగా దందా..
ఫేక్ సర్టిఫికెట్ల దందాలో మిర్యాలగూడకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణ కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఒక్కో సర్టిఫికెట్ కు రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తేలింది. నకిలీ సర్టిఫికెట్లతో నరేశ్, జగదీశ్, శివశంకర్, రవీందర్, డాక్యా ఉద్యోగాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే నారాయణపేటకు చెందిన రవీందర్ ను అరెస్ట్ చేయగా, ఇప్పుడు నరేశ్, నాగరాజును అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లని తేలడంతో నరేశ్ జాబ్ కు రిజైన్ చేశాడు.