ఆన్​లైన్​ బెట్టింగ్​ కోసం చైన్​ స్నాచింగ్​ .. అరెస్ట్​ చేసిన పోలీసులు

ఆన్​లైన్​ బెట్టింగ్​ కోసం చైన్​ స్నాచింగ్​ .. అరెస్ట్​ చేసిన పోలీసులు
  • వివరాలు వెల్లడించిన మెదక్​ ఎస్పీ ఉదయ్​ కుమార్​

మెదక్, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్​ కోసం చైన్​ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు ఆరెస్ట్  చేశారు. మెదక్  డీఎస్పీ ఆఫీస్​లో ఎస్పీ ఉదయ్​ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్  పట్టణం ఫతేనగర్ కు చెందిన మహమ్మద్  అబ్దుల్  ఖాదీర్, మహమ్మద్  అబ్దుల్  షఫీ ఆన్​లైన్​ బెట్టింగ్​కు అలవాటు పడి, డబ్బులు పోగొట్టుకున్నారు. బెట్టింగ్​ కోసం చేసిన అప్పులు తీర్చడంతో పాటు మళ్లీ బెట్టింగ్​ పెట్టేందుకు అవసరమైన డబ్బుల కోసం చైన్​ స్నాచింగ్​ చేయడం మొదలుపెట్టారు. 

జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో మహిళల మెడలో నుంచి పుస్తెలతాళ్లను లాక్కెళ్లినట్లు ఎస్పీ చెప్పారు. పలు చోట్ల చైన్​ స్నాచింగ్​కు విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఔరంగాబాద్  శివారులో వాహనాల తనిఖీలో భాగంగా బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న  వారిని వెంబడించి పట్టుకున్న ట్లు తెలిపారు. వారిని విచారించగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చైన్​ స్నాచింగ్​లకు పాల్పడినట్టు అంగీకరించారని ఎస్పీ వివరించారు. వారి నుంచి 6 తులాల రెండు పుస్తెల తాళ్లు రికవరీ చేసినట్లు చెప్పారు. దొంగలను పట్టుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్​ సీఐ రాజశేఖర్​ రెడ్డి, హవేలి ఘనపూర్​ ఎస్సై సత్యనారాయణను ఎస్పీ అభినందించారు.