నల్గొండ జిల్లాలో వ్యవసాయ మోటర్ల దొంగల అరెస్ట్ 

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.34 లక్షల విలువైన మోటార్లు, రూ.10 లక్షల నగదు, ఆటో, 3 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

కోదాడ సబ్ డివిజన్ లోని గరిడేపల్లి, మట్టంపల్లి, హుజూర్​నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్లచెరువు పీఎస్ ల పరిధిలో ఏడాది కాలంగా వ్యవసాయ మోటర్లు వరుసగా చోరీలకు గురవుతున్నాయి. మొత్తంగా 166 మోటార్ల చోరీకి గురికాగా, 26 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గరిడేపల్లి మండల పరిధిలోని కల్మల చెరువు రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకుని విచారించగా చోరీ బాగోతం బయట పడింది.

ఎన్టీఆర్ జిల్లా ముపాళ్ల గ్రామానికి చెందిన ఉప్పతల వాసు, మట్టంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన వేముల కోటేశ్వరరావు.. మట్టంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆకారపు వెంకటి, అదే మండలానికి చెందిన ఆజ్మీర మంత్రియతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. దొంగలించిన మోటర్లలోని కాపర్ ను వేరు చేసి మట్టంపల్లి గ్రామానికి చెందిన గడగండ్ల శ్రీనుకు అమ్మేవారు. దీంతో వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. గతంలో వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన సీఐ చరమందరాజు, ఎస్​ఐలు, కానిస్టేబుళ్లు ఎస్పీ అభినందించారు.