- 1.380 కిలోల గంజాయి స్వాధీనం
జైపూర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న నలుగురు సభ్యులున్న ముఠాను పట్టుకు న్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం అరెస్ట్ చేసిన ముఠా వివరాలను ఏసీపీ ఆఫీసులో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్ఐ శ్రీధర్ తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. జైపూర్ మండలం నర్వ గ్రామం వద్ద కొందరు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.
నర్వ గ్రామానికి చెందిన దూట రాజ్ కుమార్, జైపూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ అఫ్రిది, పెగడపల్లికి చెందిన తోట ప్రశాంత్, నెన్నెల మండలం ఘనపూర్ కు చెందిన పోతురాజుల ఆకాశ్ కలిసి గంజాయి తాగడమే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 1.380 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకొన్న సిబ్బంది సదయ్య, మల్లయ్యను ఏసీపీ అభినందించి రివార్డు అందజేశారు.