క్రికెట్ బెట్టింగ్​ కోసం చోరీలు.. యువకుడి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్​ కోసం చోరీలు.. యువకుడి అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: ఆన్​లైన్​లో క్రికెట్ బెట్టింగ్​లకు అలవాటు పడిన ఓ యువకుడు సెల్​ఫోన్​లను దొంగలిస్తూ కటకటాల పాలయ్యాడు. కాచిగూడ పీఎస్​లో ఏసీపీ రఘు ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాకేశ్ (23) తుర్కయంజాల్ నీలాద్రినగర్ లో నివాసం ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. ఆన్​లైన్​లో క్రికెట్ బెట్టింగ్​లు పెట్టి నష్టపోయాడు. మళ్లీ బెట్టింగ్​ల కోసం డబ్బులు సంపాదించడానికి మొబైల్ ఫోన్​ల దొంగతనాన్ని ఎంచుకున్నాడు.

తన ఇంటి వద్ద ఉన్న మరో మైనర్ బాలుడితో కలిసి బైక్​పై తిరుగుతూ సిటీలోని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇటీవల కాచిగూడ పరిధిలో జరిగిన మొబైల్ చోరీపై ఎస్ఐ రవికుమార్ సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా రాకేశ్ చేసిన దొంగతనం బయటపడింది. కాచిగూడ పీఎస్ తో పాటు హుస్సేనీ ఆలం, ఐఎస్ సదన్, మీర్ పేట్ పరిధిలోనూ నిందితుడు చోరీలకు పాల్పడ్డాడు.

శుక్రవారం రాకేశ్​తో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు మొబైల్ ఫోన్లు , బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలుడిని బాలసదన్​కు, రాకేశ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.