యువకుడి కిడ్నాప్ కు యత్నించిన పొలిటికల్ లీడర్ అరెస్ట్

  • యువకుడి కిడ్నాప్ కు యత్నించిన పొలిటికల్ లీడర్ అరెస్ట్
  •  మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఘట్​కేసర్, వెలుగు: యువకుడిని కిడ్నాప్​చేసేందుకు యత్నించిన ఓ పార్టీకి చెందిన నాయకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్ రెడ్డి సోమవారం వెల్లడించారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ బుద్ధానగర్ లో ఉండే అవినాష్ రెడ్డికి, అతడి ఎదురింట్లో ఉండే ఆరోషికా రెడ్డితో 2015లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి అవసరాల కోసం ప్రియుడి వద్ద ఆరోషిక విడతల వారీగా  దాదాపు రూ.30 లక్షలు తీసుకుంది. అవినాష్​ను కాదని ఆమె 2018లో సిద్దిపేటకు చెందిన రాజకీయ నేత గదిగోని చక్రధర్ గౌడ్​ను పెండ్లి చేసుకుంది. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అవినాష్ రెడ్డి అడగడంతో పలు దఫాలుగా రూ.9 లక్షలు తిరిగి ఇచ్చింది. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని అవినాష్ డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తాను ఇస్తానని చెప్పిన చక్రధర్ గౌడ్.. ఆదివారం ఉదయం 9 గంటలకు ఘట్​కేసర్ లోని ఓ హోటల్ కు రావాలని అవినాష్​కు ఫోన్ చేసి చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అవినాష్ ఒంటరిగా అక్కడికి వెళ్లాడు. అవినాష్​, చక్రధర్ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. అదే టైమ్ లో  చక్రధర్ అనుచరులైన రాంనగర్ కు చెందిన మామిళ్ల గౌతమ్ రాజు(33),  మేడ్చల్​కు చెందిన అలిగేటి నర్సింగ్ రావు(35), పార్శిగుట్టకు చెందిన వినోద్(37) ఆ కారులో ఎక్కారు. గతంలో ఆరోషికాతో ఉన్న ఫొటోలను సెల్​ఫోన్​లో నుంచి డిలీట్ చేయాలని అవినాష్ ను బెదిరించారు. అయితే, మిగతా డబ్బులు ఇస్తేగానీ డిలీట్ చేయనని అవినాష్ ​చెప్పటంతో అతడి సెల్​ఫోన్​ను లాక్కొని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.

ALSO READ:అమ్మకానికి షుగర్ ప్యాక్టరీ..రైతుల బకాయిల సంగతేంది.?

కారును స్టార్ట్ చేయగా.. రన్నింగ్​లో ఉండగానే అవినాష్ కిందకు దూకాడు. నిందితులు అతడిని మళ్లీ కారులోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించారు. అవినాశ్​అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. బాధితుడు ఘట్​కేసర్ పీఎస్​లో కంప్లయింట్ చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పీర్జాదిగూడలో అరెస్టు చేసి పీఎస్​కు తరలించారు. ఓ కారు, బైక్, బాధితుడి నుంచి లాక్కున్న మొబైల్​తో మరో నాలుగు సెల్​ఫోన్లను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు చక్రధర్​గౌడ్​పై ఇప్పటికే పలు పోలీస్​స్టేషన్లలో 9 కేసులున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే, తన భార్యతో గతంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించటంతో కిడ్నాప్​కు యత్నించినట్లు చక్రధర్ పేర్కొన్నాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.