
నకిలీ కేబుల్ వైర్లు విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని కోఠి జైన్ మార్కెట్ లో శ్రీ బాలాజీ ఎంటర్ ప్రైజెస్ పేరిట ముకుల్ దూరగ్ అనే వ్యక్తి కేబుల్ వైర్లను విక్రయించేవాడు. కొంతకాలంగా సదరు వ్యాపారి ఫినోలెక్స్ కేబుల్ వైర్ల పేరిట నకిలీ వైర్లను అమ్ముతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు.
ఒరిజినల్ ఫినోలెక్స్ కేబుల్ వైర్లు అంటూ ప్రజలను, ఫినోలెక్స్ కంపెనీను మోసం చేస్తున్నాడన్న సమాచారం పోలీసులకు తెలిసింది. వెంటనే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సుల్తాన్ బజార్ పోలీసులు ముకుల్ దుగర్ షాపు వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. షాపు యజమాని ముకుల్ ను అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్లో విచారించారు. ఢిల్లీకి చెందిన అనిల్ అనే వ్యక్తి తనకు నకిలీ వైర్లను సప్లై చేస్తున్నట్లు ముకుల్ దుగర్ పోలీసులకు తెలిపాడు. షాపులో ఉన్న లక్షన్నర విలువ చేసే ఫినోలెక్స్ కంపెనీ నకిలీ కేబుల్ వైర్లను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.