
వరంగల్, వెలుగు: రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీని రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించిన తెలంగాణ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో ఎస్‌ఆర్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ ఈ బెదిరింపు మెయిల్స్ పంపాడని ముంబై పోలీసులు గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన వనపర్తి గణేశ్ అలియాస్ రమేశ్ (19) హసన్‌పర్తిలోని హాస్టల్‌లో ఉంటూ అన్నాసాగర్‌లోని ఎస్‌ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని అక్టోబర్ 27న మరో వ్యక్తితో కలిసి మొదటి బెదిరింపు ఈ మెయిల్ పంపాడు. రూ.200 కోట్లు ఇవ్వాలని 28న మరో మెయిల్ పంపాడు. అదే నెల 30న రూ.400 కోట్లు ఇవ్వాలని ఇంకో బెదిరింపు మెయిల్ పంపాడు. ముంబై పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శనివారం వరంగల్‌లో ముంబై పోలీసులు గణేశ్‌ను అరెస్ట్ చేశారు.