షాద్​నగర్​లో మహిళలతో సహ జీవనం.. ఆపై హత్యలు

షాద్​నగర్​లో మహిళలతో సహ జీవనం.. ఆపై హత్యలు
  • కరుడుగట్టిన నేరస్తుడు అరెస్ట్

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్​లో మహిళను లాడ్జికి తీసుకెళ్లి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్  చేశారు. పెళ్లి చేసుకోమన్నందుకే ఆమెను దారుణంగా హతమార్చినట్లు గుర్తించారు. గతంలోనూ ఇలాగే మరో ఇద్దరు మహిళలతో నిందితుడు అక్రమ సంబంధం పెట్టుకొని ఒకరిని హత్య చేసినట్లు తేల్చారు. ఏసీపీ రంగస్వామి శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన శివలీల (35) చేగురులోని కన్హ శాంతి వనంలో స్వీపర్ గా పనిచేస్తున్నది. 

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బండమీది అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసు ఇదే ఆశ్రమంలో ఇంటర్ కాలేజీ వార్డెన్​గా పనిచేస్తూ.. శివలీలతో సహజీవనం చేస్తున్నాడు. నిందితుడికి గతంలోనే ఓ మహిళతో పెండ్లి జరగగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంసారంలో మనస్పర్ధలు రావడంతో దేవదాసును భార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాంట్రాక్ట్​ పద్ధతిలో జూనియర్ లైన్​మెన్​గా ఏపీలో పనిచేశాడు. 

గతంలో దేవదాసు బైలుప్పల గ్రామానికి చెందిన లక్ష్మితో సహజీవనం చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే అతనితో మాట్లాడుతుందని, బైక్​పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు. శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అదేవిధంగా కర్నూలు జిల్లా కేంద్రంలో టిఫిన్ సెంటర్​నడిపిస్తున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వారిని కలవనీయకుండా చేశాడు. దీంతో ఇంటికి వెళ్లి అతడిపై హత్యాయత్నం చేశాడు. 

హైదరాబాద్​కు మకాం మార్చి..

ఈ కేసులకు సంబంధించి కర్నూల్ త్రీటౌన్ పీఎస్​లో దేవదాసుపై రౌడీషీట్​ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో నిఘా ఎక్కువ కావడంతో  దేవదాసు హైదరాబాద్ మకాం మార్చాడు. కన్హ శాంతి వనంలోని కేసీపీ కాలేజ్ లో వార్డెన్ గా పనిచేస్తూ అక్కడే స్వీపర్ గా చేస్తున్న శివలీలతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి మోసం చేశాడు.  ఆమె పెళ్లిపై ఒత్తిడి చేయడంతో జనవరి 20న షాద్ నగర్​కు పిలిచి శ్రీ సంగమేశ్వర లాడ్జికి తీసుకెళ్లాడు. 

ఆపై చీర కొంగుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న బంగారు నగలను తీసుకొని బైక్​పై పరారయ్యాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.