- రూ.53.89 లక్షలు లోన్ తీసుకున్న నిందితులు
- అప్రయిజర్ తో సహా 8 మంది అరెస్ట్
హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో నకిలీ బంగారం కుదవ పెట్టి రూ.53.89 లక్షల లోన్ తీసుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చరమందరాజు వివరాలు వెల్లడించారు. బ్యాంక్ లో అధికారులు ఆడిటింగ్ చేశారు. ఇందులోభాగంగా గోల్డ్ లోన్లు తీసుకొని, చాలా ఏండ్లవుతున్నా తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి బంగారాన్ని పరీక్షించారు. తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని గుర్తించిన అధికారులు, బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేశ్ వృత్తి రీత్యా బంగారం పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడెంలో గోల్డ్ వర్క షాప్ ప్రారంభించాడు. అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చడం కోసం ఏపీలోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు గొలుసులు తయారు చేయించాడు. ఆ నగలపై ఎవరికీ అనుమానం రాకుండా కేడియం 916 హాల్ మార్క్ ముద్ర వేయించాడు.
ఆ బంగారాన్ని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పని చేస్తున్న పాత మిత్రుడు గోల్డ్ అప్రయిజర్ జిల్లేపల్లి నరేందర్ దగ్గరకు తీసుకొచ్చి బంగారం నిజమైందని ధ్రువీకరించి లోన్ మంజూరు చేయించాలని కోరాడు. లోన్ నగదులో కొంత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజేశ్, అతని భార్య వర్షత, బంధువులు కొమెరపూడి వెంకటాచారి, కణితి సాయిరాం, అతడి స్నేహితులు యర్రగొర్ల పరశురాములు, దోనేటి ముఖేశ్, మోతుకూరి సూర్య చేత నకిలీ బంగారం బ్యాంకులో కుదవ పెట్టించి రూ.53.89 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.