హైదరాబాద్: గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి గురించి మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను శనివారం సాయంత్రం గచ్చిబౌలి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు.
ప్రిజం పబ్ సమీపంలోని ఘటనా స్థలంలో ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు, 23 బులెట్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులకు విచారణలో ప్రభాకర్ వెల్లడించాడు. ప్రభాకర్ను సీసీఎస్, ఎస్ఓటీ, డీసీపీ క్రైమ్ పార్టీ నాలుగు బృందాలు విచారించాయి.
హైదరాబాద్లో ప్రభాకర్ ఉంటున్న రూమ్లో మరొక గన్తో పాటు 451 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలు సీజ్ చేశామని, ప్రభాకర్పై ఏపీ, తెలంగాణాలో చోరీలకు సంబంధించి మొత్తం 80 కేసు లు నమోదైనట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.
నిందితుడు 23 కేసులలో ప్రధాన నిందితుడని, 2022లో జైలు నుంచి పారిపోయాడని, అంతర్ రాష్ట్ర దొంగల ముఠాతో బత్తుల ప్రభాకర్కు సంబంధాలున్నాయని ఆయన వివరించారు. చోరీలకు మరొక రెండు టార్గెట్స్ పెట్టుకున్నాడని, నిన్న పట్టుకున్న సమయంలో జరగనున్న నేరాన్ని అపడం జరిగిందని పేర్కొన్నారు. సాహసోపేతంగా వ్యవహరించి ప్రభాకర్ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ అభినందించారు.
క్రైమ్స్ విభాగం డీసీపీ నర్సింహా వెల్లడించిన కీలక విషయాలు:
* 2020లో విశాఖపట్నం పరిధిలో అరిలోవా పోలీస్ స్టేషన్ నుంచి ప్రభాకర్ తప్పించుకున్నాడు
* గతంలో తనతో పట్టుబడిన మరొక నిందితుడిపై కోపం పెంచుకొని హత్య చెయ్యాలని పథకం వేసుకున్నాడు
* ప్రస్తుతం మరొక నిందితుడు జైల్లో ఉన్నాడు
* బీహార్కు వెళ్లి రెండు సందర్భాల్లో ప్రభాకర్ మూడు గన్లు కొన్నాడు
* గన్స్ కొనుగోలులో సహాయం చేసిన వాళ్ళ గురించి విచారణ చేపడుతున్నాం
* దొంగతనాలు చేస్తున్న సమయంలో తుపాకులతో బెదిరించి తప్పించుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు
* ఆ సమయంలో ఎవరైనా అడ్డు వస్తే చంపడానికి కూడా ప్రభాకర్ వెనుకాడడు
* 8 నెలల నుంచి తుపాకులను పట్టుకుని తిరుగుతున్నాడు
* ప్రభాకర్ 23 కేసులలో ప్రధాన నిందితుడు
* 21 కేసులు గతంలో, నిన్న (శనివారం, ఫిబ్రవరి 1, 2025) రెండు కేసులు పెట్టడం జరిగింది
* 2013 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు.. ప్రభాకర్ రెక్కీ చేసి దొంగతనాలు చేస్తున్నాడు
* గచ్చిబౌలి పరిధిలోని అపార్ట్మెంట్ ఫ్లాట్ మిత్రుడి పేరు మీద తీసుకొని అక్కడ ఉంటున్నాడు
* దొంగతనాల ద్వారా వచ్చిన డబ్బులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడం నిందితుడికి అలవాటు
* ప్రభాకర్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది
* రెండు నెలల్లో కోలుకోనున్నట్లు డాక్టర్లు తెలిపారు