జైలుకెళ్లినా ఆ బ్రదర్స్ తీరుమారలేదు

  • బయటకొచ్చి మళ్లీ బైక్​ చోరీలు
  • ఇద్దరు నిందితుల అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: వరసకు సోదరులయ్యే వారిద్దరూ వేర్వేరుగా చోరీలు చేసి జైలుకు వెళ్లొచ్చారు. అయినా తీరు మార్చుకోకుండా కలిసి దొంగతనాలు చేస్తూ మరోసారి పోలీసులకు చిక్కారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలి పీఎస్​లో మాదాపూర్​ఏసీపీ శ్రీకాంత్ ​వెల్లడించారు. బహదూర్​పుర సిఖ్ చౌక్​కు చెందిన కరన్​వీర్ సింగ్(24) డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతనికి వరసకు సోదరుడయ్యే కరీంనగర్ సిఖ్​వాడికి చెందిన జగజ్యోత్ సింగ్(23) సిటీకి వచ్చి ఎస్ఆర్ నగర్​లో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం వేర్వేరుగా పలుచోట్ల దొంగతనాలు చేశారు.

కరన్​సింగ్ గతంలో పంజాగుట్ట, హుమాయూన్​నగర్, బేగంబజార్, కూకట్​పల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలో బైక్​దొంగతనాలు చేయగా, జగజ్యోత్​సింగ్ మియాపూర్, మాదాపూర్, ఆర్సీపురం, చందానగర్, కేపీహెచ్​బీ, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ఇళ్లలో చోరీలు చేసి, జైలుకెళ్లారు. అక్కడ వీరిద్దరికి మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు.

ఈ నెల 5న గచ్చిబౌలి సుదర్శన్​నగర్ కాలనీలో  రెండు ఖరీదైన బైక్​లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా శుక్రవారం నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి చోరీకి గురైన రూ.3.50 లక్షల విలువైన రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.